కరోనా కారణంగా చాలా వరకు విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇంటర్‌నెట్ సిగ్నల్ కోసం విద్యార్థులు చెట్లు, కొండలు, వాటర్ ట్యాంకులు, ఎత్తైన ప్రదేశాలు.. పైకి వెళ్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాగే ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఓ విద్యార్థి ఇంటర్‌నెట్ సిగ్నల్ కోసం ప్రయత్నించగా.. కొండపై నుంచి కిందపడి మరణించాడు. ఈ విషాద ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. అడ్రియా జాగరంగా అనే విద్యార్థి భువనేశ్వర్‌లోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే కోవిడ్ నేపథ్యంలో స్కూల్స్ మూసివేయబడ్డ నేపథ్యంలో.. అతడు రాయగడ జిల్లా పద్మాపూర్ బ్లాక్‌లోని తన గ్రామమైన కందపాండురగూడలో ఉంటున్నాడు.
అయితే అడ్రియా.. క్రమం తప్పకుండా చదువుకోవడానికి కొండపైకి వెళ్లేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కూడా ఇలాగే కొండపై వెళ్లి సిగ్నల్ కోసం ప్రయత్నిస్తుండగా కిందపడ్డాడని చెప్పారు. దీంతో అడ్రియాను పద్మాపూర్ బ్లాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.
ఈ ఘటనపై పద్మాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హిరేన్ భాటి మాట్లాడుతూ.. ‘బాలుడు పెద్ద బండరాయిపై ఉన్న మరో రాయిపైకి ఎక్కాడు. బాలుడి వద్ద స్మార్ట్‌పోన్ ఉన్నట్టు అతనితో పాటు వచ్చిన మరో నలుగురు పిల్లలు తెలిపారు. అయితే ఆ సమయంలో బాలుడు కొండపై నుంచి పడి మృతిచెందాడు. ఈ గ్రామం రాయగడ జిల్లా కేంద్రానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. విచారణ సమయంలో నేను కూడా సిగ్నల్స్ లేకపోవడం గమనించాను. ప్రమాదం జరిగిన గ్రామానికి 400 మీటర్ల దూరంలో మొబైల్ సిగ్నల్స్ పొందవచ్చు’అని తెలిపారు.
ఇక, రాయగడ వామపక్ష తీవ్రవాద జిల్లాగా ఉంది. ఒడిశాలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలో మొత్తం 256 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయని ఇటీవల రాజ్యసభలో బీజేడీ సభ్యుడు అమర్ పట్నాయక్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ టవర్లు.. పూర్తి స్థాయిలో ఇంటర్‌నెట్ కనెక్టివిటీని అందించడానికి పూర్తిగా సరిపోవని చెప్పారు. అయితే వామపక్ష ప్రభావిత జిల్లాల్లో 400కి పైగా ప్రదేశాలలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha, Online classes