టెక్నాలజీని అడ్డుపెట్టుకుని పదుల సంఖ్యలో మహిళలను వేధించిన ఘటనలో ఢిల్లీ-NCRకి చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఒక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మహిళలకు ఫోన్ చేసి వారితో అసభ్యంగా మట్లాడటం, వేధింపులకు గురిచేయడం వంటివి చేసేవాడు. ఘటనకు పాల్పడిన 22ఏళ్ల దీపక్ అనే వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు. అరెస్టు చేసే సమయానికి అతడి ఫోన్లో 500 మంది మహిళల ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వివిధ రాష్ర్టాలకు చెందిన యువతులు, మహిళల ఫోన్ నంబర్లు అతడి ఫోనులో ఉన్నాయి. ఒక మహిళా న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేటుగాడిని పట్టుకున్నారు.
పట్టుబడిన యువకుడు అయిదో తరగతిలోనే చదువు మానేశాడు. సాధారణంగా ఏదో ఒక నంబరుకు ఫోన్ చేసేవాడు. ఎవరైనా మహిళలు ఫోన్ ఎత్తి మాట్లాడితే కాంటాక్ట్ సేవ్ చేసుకునేవాడు. ఆ తరువాత వారికి వాట్సప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. వారు నంబర్ బ్లాక్ చేస్తే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి వారికి ఫోన్ కలిపేవాడు. తన కాంటాక్ట్ నంబరు కనిపించకుండా ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేవాడు. దీంతో అతడి ఐపీ అడ్రస్ కూడా దొరకకుండా జాగ్రత్తపడేవాడు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారినీ వేధించాడు.
ఫిర్యాదు చేసిన యువతి... తనకు ఇతర దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి ఆ నంబరుపై నిఘా ఉంచారు. ఒక యువతికి చేసిన వాట్సాప్ కాల్ ఆధారంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నారు. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 'ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నాం. సదరు వ్యక్తి పూర్వ నేరచరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఘటనకు సంబంధిచి మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం' అని ఘజియాబాద్ ఎస్ఎస్పీ కళానిధి నైతని తెలిపారు.
"నిందితుడి లొకేషన్ ట్రేస్ చేసేందుకు నెల రోజుల పాటు కష్టపడ్డాం. ఒక యువతికి చేసిన వాట్సాప్ కాల్ ద్వారా అతడి ఐపీ అడ్రస్ పట్టుకోగలిగాం. తనకు తెలిసిన వారి ఫోన్ నంబర్లను ఉపయోగించి ఎన్నో ఫేక్ వాట్సాప్ అకౌంట్లు ఓపెన్ చేసేవాడు. వాటి ద్వారా మహిళలను వేధించేవాడు. ఇలాంటి చర్యలు నిరోధించేలా వాట్సాప్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాట్సాప్‌ను కోరతాం" అని ఘజియాబాద్ సైబర్ సెల్ ఇంచార్జి అభయ్ మిశ్రా వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Haryana