నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. ఏడు సంవత్సరాల తర్వాత, ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత దోషులకు ఉరి శిక్ష అమలైంది. అయితే, ఈ ఏడు సంవత్సరాల్లో నిర్భయ దోషులు తీహార్ జైల్లో పనులు చేసి ఎంత సంపాదించారో తెలుసా. అక్షరాలా రూ.137000. అయితే, ఇది ముగ్గురు సంపాదన మాత్రమే. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్త, వినయ్ శర్మలు మాత్రమే పని చేసి డబ్బులు సంపాదించారు. అక్షయ్ ఠాకూర్ రూ.69వేలు, పవన్ గుప్త రూ.29వేలు, వినయ్ శర్మ రూ.39వేలు సంపాదించారు. ఉరిశిక్ష తర్వాత జైలు అధికారులు వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో ఈ డబ్బును కూడా అందజేశారు. జైల్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు వినయ్ శర్మ 11 సార్లు, అక్షయ్ ఒక సారి శిక్ష అనుభవించాడు. ఇక ముఖేష్ మూడు సార్లు, పవన్ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. 2016లో ముఖేష్, పవన్, అక్షయ్.. పదో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ వారు పాస్ కాలేదు. 2015లో వినయ్ బ్యాచిలర్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.. కానీ పూర్తి చేయలేదు.
నలుగురిని ఉరితీసే ముందు వారిని ఎందుకు ఉరితీస్తున్నారో తెలియజేస్తూ కోర్టు తీర్పును జైలు అధికారులు చదివి వినిపించారు. అనంతరం వారు వీలునామా ఏమైనా రాస్తారా అని అడిగారు. అందుకు వారు స్పందించలేదు. ఉరికంబం ఎక్కించేందుకు తీసుకుని వెళ్తున్న సమయంలో మిగిలిన ముగ్గురు మౌనంగానే ఉండిపోయారని, వినయ్ శర్మ మాత్రం ఏడ్చాడని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya, Nirbhaya case