హోమ్ /వార్తలు /క్రైమ్ /

నిర్భయ కేసు: అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ కేసు: అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా

నలుగురు దోషుల్లో ఇప్పటికే ముకేష్ సింగ్, వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం అక్షయ్ కూడా క్షమాభిక్ష కోరగా.. దాన్ని బుధవారం రాష్ట్రపతి తిరస్కరించారు.

  నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ మేరకు హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నలుగురు దోషుల్లో ఇప్పటికే ముకేష్ సింగ్, వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం అక్షయ్ కూడా క్షమాభిక్ష కోరగా.. దాన్ని బుధవారం రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ కేసులో మరో దోషిగా ఉన్న పవన్ మాత్రం.. ఇప్పటి వరకు రివ్యూ, క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేయలేదు.


  మరోవైపు నిర్భయ దోషుల ఉరిశిక్షను అమలు చేయాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దోషుల ఉరి శిక్ష అమలుపై ట్రయల్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ, తాము వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేసి, దోషులను ఉరితీసేందుకు వీలైనంత త్వరగా డెత్ వారెంట్ జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది.

  నిర్భయ కేసులో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. నిర్భయ దోషుల ఉరిపై పాటియాలా కోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ, కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పాటియాల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు. దోషులను వేర్వేరుగా ఉరి తీయాల్సిన అవసరం లేదని.. ఒకేసారి నలుగురు దోషుల్ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు న్యాయపరమైన అవకాశాలకు వినియెగించుకునేందుకు దోషులకు వారం పాటు హైకోర్టు గడువు ఇచ్చింది.

  2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని దోషులు... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు. దీనిపై విమర్శలు వస్తుండటంతో... కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Nirbhaya case, Ramnath kovind

  ఉత్తమ కథలు