నిర్భయ కేసు... తీహార్ జైల్లో డమ్మీల ఉరితీత...

ఓ బ్యాగ్‌ నిండా గోధుమలు, ఇసుక నింపారు. అది ఓ దోషి బరువుకు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకున్నారు. అనంతరం ఆ బ్యాగ్‌ను ఉరికొయ్య మీదకు ఎక్కించారు.

news18-telugu
Updated: January 27, 2020, 10:29 PM IST
నిర్భయ కేసు... తీహార్ జైల్లో డమ్మీల ఉరితీత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ కేసుకు సంబంధించి దోషులను ఉరితీసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తీహార్ జైల్లో దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు డమ్మీలను ఉరితీశారు. డమ్మీలు అంటే దోషుల ఎత్తు, బరువుకు సమానమైన బరువుగల ఓ బ్యాగ్‌ను ఉరితీస్తారన్నమాట. ఉరితీతకు సంబంధించినవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోచెక్ చేసుకోవడానికి ఇలా డమ్మీలను ఉరితీస్తారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31), ముఖేష్ కుమార్ సింగ్ (31), పవన్ (26) లను వాస్తవానికి ఈనెల 22న ఉరితీయాల్సి ఉన్నా ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో వారిని ఉరి తీసే తలారులు ట్రయల్ రన్ నిర్వహించారు. వారిని ఉరి తీసేతాళ్లను యూపీలోని మీరట్ నుంచి తీసుకొచ్చారు.

ఈ రోజు మధ్యాహ్నం ఓ బ్యాగ్‌ నిండా గోధుమలు, ఇసుక నింపారు. అది ఓ దోషి బరువుకు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకున్నారు. అనంతరం ఆ బ్యాగ్‌ను ఉరికొయ్య మీదకు ఎక్కించిన తలారి దానికి ఉరి తీశాడు. ఉరి సరిగా బిగుసుకుందా? లేదా?, ఉరి తీసే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి? వంటి అంశాలను పరిశీలించుకున్నారు. ఇలాంటి ప్రక్రియను మరో రెండు మూడు సార్లు నిర్వహిస్తారని జైలు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఫిబ్రవరి 1న దోషులను ఉరితీసే సమయానికి ముందు వారిని తమ కుటుంబాలతో కలవడానికి అనుమతి ఇస్తారు. ఈ రోజు అక్షయ్ కుమార్ సింగ్‌ను అతడి భార్య, తల్లి, మేనల్లుడు కలిసినట్టు జైలు అధికారులు చెప్పారు. అయితే, చివరగా ఉరి తీసే ముందు మరోసారి కూడా కలుసుకునే వెసులుబాటు వారికి ఉంటుంది.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు