NINE YEAR OLD GIRL CRUSHED TO DEATH IN LIFT IN HYDERABAD NK
లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి... తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి... తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు (File)
Hyderabad : ఇలాంటి ఘటనలు మనల్ని ఎంతగానో బాధపెడతాయి. లిఫ్ట్ వల్ల చిన్నారి చనిపోవడం అత్యంత విషాదకరం. అసలేం జరిగిందో తెలుసుకుందాం. మన ఇళ్లలో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం.
Telangana News : హైదరాబాద్... హస్తినాపురంలో జరిగిందీ ఘటన. అక్కడ కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్కి రెండు లిఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఒక లిఫ్ట్ విషయంలో జరిగిందీ దుర్ఘటన. లాస్యకు తొమ్మిదేళ్లు. చాలా మంది పిల్లల్లాగే చురుకైనది, తెలివైనది. టైమ్ మధ్యాహ్నం 1 అయ్యింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న లాస్య... ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లాలనుకుంది. ఆ అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌కి ఉన్న రెండు గ్రిల్స్‌లో బయటి గ్రిల్‌ను లాగింది. ఏ సమస్యా రాలేదు. రెండో గ్రిల్ (లోపలి గ్రిల్) తెరుస్తుండగా... లిఫ్ట్ కదలడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయిన లాస్య... లిఫ్ట్ గ్రిల్ వదిలేయకుండా అలాగే పట్టుకొని చూడసాగింది. లిఫ్ట్ కిందకు వెళ్లిపోతుంటే... లాస్య... కిందపడి... లిఫ్టులో సగం... బయట సగం పడిపోయింది. లిఫ్ట్ కిందకు వెళ్లిపోవడంతో... చిన్నారి మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ పాప అరుపులు విని అందరూ పరిగెత్తుకొచ్చారు. షాకయ్యారు. వెంటనే లాస్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ... అప్పటికే ఆ చిట్టితల్లి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో... గుండెలు పగిలేలా ఏడ్చారు ఆ తల్లిదండ్రులు. చుట్టుపక్కల వాళ్లు ఎంత ఓదార్చుతున్నా... వాళ్ల కన్నీటి ఆపడం ఎవరి వల్లా కాలేదు.
పాప ఇక రాదన్న విషాదంలో ఉన్న పేరెంట్స్ పోలీసులకు విషయం చెప్పలేదు. కానీ ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం చేరింది. వాళ్లు వచ్చి... లిఫ్టును పరిశీలించారు. కేసు పెడితే... బిల్డర్‌పై దర్యాప్తు చేస్తామని అంటున్నారు. కానీ ఆ పేరెంట్స్ కేసు పెట్టేందుకు సిద్ధంగా లేరు. కేసు పెట్టినా చిన్నారి ఇక రాదన్న బాధ వాళ్లను మరేమీ ఆలోచించనివ్వట్లేదు. పోలీసులు మాత్రం... లిఫ్టులో టెక్నికల్ సమస్య వచ్చిందేమో తెలుసుకుంటామని అంటున్నారు.
ఈ ఘటన ద్వారా మనం జాగ్రత్త పడాల్సిందే. మన ఇళ్లలోనూ పిల్లలుంటారు. మన చుట్టూ కూడా ఇలాంటి లిఫ్టులుంటున్నాయి. స్కూళ్లలోనూ లిఫ్టులు ఉంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లల్ని ఒంటరిగా లిఫ్టుల దగ్గరకు వెళ్లనివ్వకూడదు. లిఫ్టులతో ఎలా వ్యవహరించాలో వాళ్లకు ఒకటికి పది సార్లు చెప్పాలి. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం. అలా ఎవరికీ జరగకూడదని కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.