news18-telugu
Updated: November 27, 2018, 7:06 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా నెత్తురోడింది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో మావోయిస్టు తీవ్ర గాయాలతో పోలీసులకు దొరికాడు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు. ఎన్నికలు ముగిసినా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ల కోసం బలగాలు వెతుకుతూనే ఉన్నాయి. ఆపరేషన్ పహార్-4లో భాగంగా డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వుడ్ గ్రూప్), సీఆర్పీఎఫ్కు చెందిన 206, 208 యూనిట్ల కోబ్రా దళాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన వెయ్యి మందికిపైగా భద్రతా దళాలు... సాల్టాంగ్, సక్లేర్ అటవీ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో సోమవారం డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేశాయి.

ప్రతీకాత్మక చిత్రం
కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సక్లేర్ అడవిలో దాదాపు 50 మంది మావోయిస్టులు గుమిగూడి ఉండటంతో, సుమారు 100 మంది సైనికులు వాళ్లను చుట్టుముట్టారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో, జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. గంటసేపు ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆ తర్వాత ఘటనా స్థలంలో తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాల్ని జవాన్లు గుర్తించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ మావోయిస్టును ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ గన్, ఐఈడీ, బర్మార్ గన్, పేలుడు పదార్థాల తయారీ సామగ్రి, పదునైన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల తర్వాత చుట్టుపక్కల గాలించినా దట్టమైన అడవి కావడంతో మిగిలిన మావోయిస్టులు పారిపోయినట్లు తెలిసింది. తప్పించుకున్న మావోయిస్టులు మరిన్ని మృతదేహాలను ఎత్తుకెళ్లి ఉంటారని జవాన్లు భావిస్తున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 27, 2018, 7:06 AM IST