Home /News /crime /

NHRC TEAM VISITS CHATANPALLI ENCOUNTER PLACE AFTER EXAMINES BODIES IN HOSPITAL MS

ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన మానవ హక్కుల కమిషన్..

చటాన్‌పల్లి అండర్‌పాస్

చటాన్‌పల్లి అండర్‌పాస్

మానవ హక్కుల కమిషన్ చటాన్‌పల్లికి చేరుకున్నాక.. మొదట అండర్‌పాస్ వద్ద దిశా మృతదేహాన్ని కాల్చివేసిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు.

    షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లిలో దిశా నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మొత్తం 10మంది పోలీస్ అధికారులను మానవ హక్కుల కమిషన్ ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకుంది. దిశా ఘటనను విచారిస్తున్న ఏసీపీతో పాటు పర్యవేక్షిస్తున్న డీసీపీలను పలు ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించింది.

    మానవ హక్కుల కమిషన్ చటాన్‌పల్లికి చేరుకున్నాక.. మొదట అండర్‌పాస్ వద్ద దిశా మృతదేహాన్ని కాల్చివేసిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ స్థలంలో మృతదేహాల మార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఆ ప్రదేశాన్ని సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీశారు. అంతకుముందు మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను మానవ హక్కుల కమిషన్ పరిశీలించింది.

    కాగా,జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం పరిశీలన అనంతరం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు. అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారని తెలిపారు.ఈ క్రమంలో వారి కోసం గంటరన్నర పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆస్పత్రిలోనే వేచి ఉన్నారన్నారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి మరోసారి మృతదేహాలను పరిశీలించిన సభ్యులు.. తిరిగివెళ్లే సమయంలో మృతుల కుటుంబాలతో మట్లాడినట్టు చెప్పారు. ఘటనపై వారి నుంచి వాంగ్మూలం సేకరించారు.

    ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Disa Rape and Murder, Human rights commission, Telangana

    తదుపరి వార్తలు