కటక్: మనిషి ప్రాణం ఏ క్షణంలో గాల్లో కలిసిపోతుందో ఎవరూ ఊహించలేరు. వాళ్లిద్దరికీ ఇటీవలే వివాహమైంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితం. కానీ.. గాలిపటం ఆ జంట జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. మాంఝా ఆమె భర్త ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని కటక్‌లో జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని కటక్‌లో ఉన్న బైరిపూర్ ప్రాంతానికి చెందిన జయంత్ సామల్ అనే యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది.
భార్యతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న అతని జీవితం ఇలా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. ముప్పై ఏళ్లు కూడా నిండని ఆ యువకుడి జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది. గత ఆదివారం భార్యతో కలిసి కటక్ నుంచి అత్తగారి ఊరికి జయంత్ బైక్‌పై వెళుతున్నాడు. కొత్త జంట ఆమాటా ఈమాటా చెప్పుకుంటూ హ్యాపీగా బైక్‌పై వెళుతున్నారు. అలా వెళుతున్న సమయంలో బైక్ పీర్ బజార్ ప్రాంతానికి రాగానే గాలి పటం మాంఝా దారం జయంత్ మెడకు చిక్కుకుంది. వెంటనే బైక్ అదుపు తప్పింది.
బైక్ నడుపుతున్న జయంత్, వెనుక కూర్చున్న అతని భార్య ఇద్దరూ కిందపడిపోయారు. జయంత్ మెడకు మాంఝా కారణంగా గాయమైంది. తలకు కూడా రోడ్డు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. హుటాహుటిన అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జయంత్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో జయంత్ భార్యకు కూడా గాయాలైనప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై జయంత్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిషేధిత మాంఝాను వినియోగించిన వ్యక్తిపై, అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలా.. మాంఝాతో గాలిపటం ఎగురవేయాలన్న ఒకరి సరదా కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది.
ఇది కూడా చదవండి: OMG: ఒకప్పుడు ‘బతుకు జట్కా బండి’ లాంటి షోలో కనిపించిన ఈ మహిళ.. ఇప్పుడు..
ఇలాంటి ఘటనలు జరిగి పలువురి ప్రాణాలు పోవడంతో 2016లో ఒడిస్సా హైకోర్టు కటక్‌లో మాంఝా వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు పట్టించుకోకుండా వ్యవహరిస్తుండంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితులున్నాయి. ఒక్క కటక్‌లోనే కాదు గతంలో దేశంలోని పలుచోట్ల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. బైక్‌పై వెళుతున్న వారికి మాంఝా మెడకు చుట్టుకుని గొంతు తెగి రక్తస్రావం కావడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ గతంలో చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో కూడా జయంత్ తలకు గాయంతో పాటు మాంఝా కారణంగా అతని గొంతు తెగి రక్తస్రావమైనట్లుగా కూడా పోలీసులు తేల్చారు. మెడకు అయిన గాయం కారణంగానే ఎక్కువ రక్తం పోయిందని, మాంఝా కారణంగానే అతని ప్రాణం పోయిందని విచారణలో తేలింది. జయంత్ భార్యకు కూడా తృటిలో ప్రమాదం తప్పిందని, అతని భార్య వెనుక కూర్చోవడం వల్ల ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. కొత్తగా పెళ్లి చేసుకుని ఆనందంగా సాగిపోతున్న ఈ జంట జీవితంలో ఒక రోజు సాయంత్రం ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం శోచనీయం. జయంత్ మృతదేహంపై పడి అతని భార్య రోదించిన తీరు హాస్పిటల్‌లోని వారిని కలచివేసింది. పోలీసులు జయంత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జయంత్ ఎవరి జోలికి వెళ్లేవాడు కాదని, కష్టపడి పనిచేసుకుంటూ భార్యను సంతోషంగా చూసుకుంటున్న అతని జీవితం ఇలా ముగిసిపోతుందని కలలో కూడా ఊహించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Crime news, Newly Couple, Odisha