Karimnagar: ఇంట్లో ఒంటరిగా నవ వధువు.. పొలం పనులకు వెళ్లిన అత్తామామలు.. తిరిగొచ్చేసరికి దారుణం..

ప్రతీకాత్మక చిత్రం

రెండు నెలల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన అనిల్‌కు, హుజురాబాద్‌కు చెందిన మ్యాడారి ప్రణాళికతో(21) వివాహం జరిగింది.

  • Share this:
    తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. అత్తారింట్లో ఓ నవ వధువు దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రెండు నెలల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన అనిల్‌కు, హుజురాబాద్‌కు చెందిన మ్యాడారి ప్రణాళికతో(21) వివాహం జరిగింది. అనిల్ హుస్నాబాద్‌లో బ్యాటరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇటీవలే ప్రణాళిక.. పుట్టింటికి వెళ్లింది. గురువారమే అత్తారింటికి తిరిగి వచ్చింది. ఇక, శుక్రవారం ఉదయం అనిల్ హుస్నాబాద్‌కు వెళ్లాడు. అతని తల్లిదండ్రులు పొలం పనులపై వెళ్లారు.

    దీంతో ప్రణాళిక ఒంటరిగా ఇంట్లో ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. పొలం నుంచి తిరిగి వచ్చిన అనిల్ తల్లిదండ్రులు.. ప్రణాళిక రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ తిన్నారు. వెంటనే అనిల్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. దీంతో అనిల్ పోలీసులకు ఫోన్ చేసి భార్య హత్యకు గురైందని సమాచారం అందించాడు.

    దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రణాళిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం దుండగులు ప్రణాళికను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక, మృతురాలి భర్త అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఇంట్లోనే నవ వధువు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు ప్రణాళికను దుండగులు పథకం ప్రకారమే హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తి ఇంటికి రావడంతో.. అన్నం పెట్టి మర్యాద చేద్దామనుకుంటే చివరకు ప్రాణం పోయిందనే ప్రచారం బొమ్మనపల్లి గ్రామంలో జోరుగా సాగుతోంది.
    Published by:Sumanth Kanukula
    First published: