కొత్త ఏడాది తొలి రోజే తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో కలిపి పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా మాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వికారాబాద్ పోలీస్ ఎస్సై శ్రీను నాయక్, ఆయన తండ్రి మాన్య నాయక్ దుర్మరణం చెందారు. వారం కిందటే పెళ్లి చేసుకున్న ఎస్సై శ్రీను.. అత్తారింట్లో ఒడి బియ్యం నింపుకొని.. ఆటో డ్రైవరైన తండ్రితో తిరిగొస్తుండగా టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మాల్, వికారాబాద్ పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
నల్లగొండ జిల్లాలో మాల్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వస్తుండగా, చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద అదుపుతప్పి ఓ ఆటోను ఢీకొట్టింది. ఆ ఆటోలో ప్రయాణిస్తోన్న పోలీస్ ఎస్సై శ్రీను నాయక్(32), ఆయన తండ్రి మాన్యా నాయక్ తీవ్ర గాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీను నాయక్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా. వారం కిందటే (డిసెంబర్ 26న) మాల్ (నల్గొండ జిల్లా)కు చెందిన యువతితో వివాహం జరిగింది. వారి ఆచారం ప్రకారం పెళ్లయిన వారానికి అత్తారింట్లో ఒడి బియ్యం నిర్వహించారు. తండ్రితో కలిసి ఆటోలో అత్తారింటికి వెళ్లిన ఎస్సై శ్రీను నాయక్ ఒడి బియ్యం నింపుకొని తిరిగొస్తుండగా పోలేపల్లి రాంనగర్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఆటో డైవరైన మాన్యా నాయక్ కు ఇటీవలే చేతికి గాయం కాగా, శనివారం నాటి ప్రయాణంలో ఎస్సై శ్రీను నాయకే ఆటోను నడిపారు. తండ్రీకొడుకులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే మాల్ పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి రెస్క్యూ నిర్వహించారు. రెండు మృతదేహాలు, గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. వారం కిందటే పెళ్లయిన శ్రీను నాయక్, ఆయన తండ్రి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీస్ శాఖలోనూ యువ ఎస్సై మృతి చర్చనీయాంశమైంది. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా శనివారం జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Police, Road accident, Telangana Police, Vikarabad