కాళ్ల పారాణి ఆరకముందే... రక్తపు మడుగులో నవ దంపతులు.. కామారెడ్డిలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లిద్దరూ బుధవారమే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పోలీసుల సాయం కోరదామని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. బస్ దిగారు. కానీ ఇంతలోనే... విధి ఆడిన వింత నాటకంలో ఆ దంపతుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి.

 • News18
 • Last Updated :
 • Share this:
  ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకున్నారు.. పెద్దలకు తెలియకుండా బుధవారం ఉదయం పెళ్లి చేసుకుని బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. పోలీసుల ఆశ్రయం కోరడానికి బస్సు దిగి స్టేషన్ కు నడుచుకుంటూ బయలుదేరారు. ఇంతలో గుర్తు తెలియని వాహనం ఆ నవదంపతులను ఢీకొట్టి వెళ్ళిపోయింది. దీంతో ఒకరు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంబిద్దామనుకునేలోపు రెండు నిండు జీవితాలు గాలిలో కలిసి పోయాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని మోడేగాం గ్రామానికి చెందిన నవ దంపతులు ఈ ప్రమాదంలో చనిపోయారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భట్టు సతీష్(24) ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ లోని హోటల్ లో క్యాటరింగ్ పని చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఠాకూర్ మహిమ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు నిన్న హైదరాబాద్ లో వివాహం చేసుకుని బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు.

  సదాశివనగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు దిగి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొని వెళ్లిపోగా ప్రమాద స్థలంలోనే మహిమ మృతి చెందింది. సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన పోలీసులు వారి వాహనంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన సతీష్ ను నిజామాబాద్ తరలించగా.. రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.

  కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అనుకోకుండా జరిగిందా...? లేదా..? దీని వెనుక ఎవరి కుట్రైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనా.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ నవ జంటను.. పారాణి ఆరకముందే విధి బలి తీసుకోవడం విషాదకరం.
  Published by:Srinivas Munigala
  First published: