మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. శంకర్ రెడ్డిని అరెస్ట్ చేయసిన తర్వాత ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని.. కేసులో మతకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. ఈనెల 15న ఆయన భుజానికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన పనులు ఆయన చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు శంకర్ రెడ్డి పేరుతో సీబీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు పేర్కొన్నట్లు సమాచారం. వివేకా హత్యతో తనకు సంబంధం లేదని.. హత్య ఎవరు చేశారో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్ కు తెలుసని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో సునీత పదేపదే సీబీఐ అధికారులను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్య జరిగిన తర్వాత వివేకా కాల్ డేటాను డిలీట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సంబంధముందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి.., వైఎస్ వివేకాపై గెలిచారని.. తనకు రాజకీయంగా అడ్డుగా ఉండకూడదనే వివేకా హత్యకు కుట్ర చేసి ఉండొచ్చని సంచలన ఆరోపణలు చేశారు. బీటెక్ రవిని కస్టడీలోకి తీసుకోని విచారించాలని కోరారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి.. హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40కోట్లు ఇస్తారని.. అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తామని చెప్పినట్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఏమీ జరగకుండా చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లో దస్తగిరి పేర్కొన్నాడు. హత్య జరిగిన తర్వాత కూడా శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏమీ జరగకుండా చూసుకుంటారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వెల్లడించాడు. మరోవైపు దస్తగిరి అప్రూవర్ పిటిషన్ కు కౌంటర్ గా ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఈనెల 22కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, YS Avinash Reddy, Ys viveka murder case