చిత్తూరు: మదనపల్లె జంట హత్యల కేసులో రోజులు గడిచేకొద్దీ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కాచెల్లెల్లిద్దరినీ ఆ తల్లిదండ్రులిద్దరూ దారుణంగా హత్య చేసిన రోజు వారిని ప్రత్యక్షంగా చూసిన వారు అసలేం జరిగిందన్నది వెల్లడిస్తున్నారు. ఆ ఘోరం జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఆ ఇంట్లో అక్కాచెల్లెళ్లను చూసిన ఓ భూతవైద్యుడు కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. ఘటన జరిగిన రోజు తాను ఉన్న సమయంలో ఏం జరిగిందన్నది మీడియా ముందుకు వచ్చి తెలిపారు. బుగ్గకాలువ ప్రాంతానికి చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్యను ఘటన జరిగిన రోజున ఆ తల్లిదండ్రులే ఇంటికి పిలిపించారట. ఆ రోజు అక్కడో ఓ వ్యక్తి వారితోపాటు పూజల్లో ఉన్నాడంటూ కొన్ని విషయాలను సుబ్బరామయ్య బయటపెట్టాడు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
’నేను దుర్గమ్మ భక్తుడిని. దాదాపు 50 ఏళ్లుగా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి నేను వైద్యం చేస్తున్నాను. గత శనివారం ఉదయం భాస్కర్, రాజు అనే అన్నాదమ్ముళ్లు నా వద్దకు వచ్చారు. తమ బంధువులైన పురుషోత్తం నాయుడు, పద్మజ పిల్లలకు సీరియస్ గా ఉందని చెప్పారు. అర్జెంటుగా రావాలని నన్ను తీసుకెళ్లారు. వాళ్లింటికి వెళ్లిన సమయంలో పై అంతస్తులో ఓ అమ్మాయి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందనే ఉండగా వాళ్ల అమ్మ వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరింది. నేను సరేనని చెప్పి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి గుడి దగ్గర పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, తాయత్తులు తీసుకుని ఇంటికి వచ్చా. మళ్లీ వాళ్లింటికి వచ్చిన సమయంలో ఆ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో పాటు ఓ సన్నటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ అమ్మాయిల దగ్గర కూర్చుని చెవిలో ఊదడం చూశాను. నేను తెచ్చిన తాయత్తులు, పూజ సామగ్రి తీసుకుని నాకు మూడు వందల రూపాయలు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇంత ఘోరం జరిగిందని తెలిసి చాలా బాధేస్తోంది‘ అని సుబ్బరామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, కన్నకూతుళ్లనే దారుణంగా హత్య చేసిన కేసులో తల్లిదండ్రులిద్దరిపై కేసులు పెట్టి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. పద్మజ మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్ లో ఉంచారు. గదిలో పూజలు చేసుకుంటూ, మంత్రాలు చదువుతూ ఉందని జైలు అధికారులు చెప్పుకొచ్చారు. అదే సమయంలో తండ్రి పురుషోత్తం నాయుడిని మాత్రం ఇతర ఖైదీలతో సాధారణ బ్యారక్ లో పెట్టినట్టు తెలిపారు.
Published by:Hasaan Kandula
First published:January 28, 2021, 06:37 IST