• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • NEW TWIST IN KHAMMAM MINOR GIRL REPE CASE NS

Khammam Rape: ఖమ్మం అత్యాచార బాధితురాలి కేసులో కొత్త కోణం.. ఈ దారుణానికి కారణం ఆ పెద్ద మనిషి స్వార్థమే..

Khammam Rape: ఖమ్మం అత్యాచార బాధితురాలి కేసులో కొత్త కోణం.. ఈ దారుణానికి కారణం ఆ పెద్ద మనిషి స్వార్థమే..

ప్రతీకాత్మక చిత్రం

Khammam Rape: కామాంధుడి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన మైనర్‌బాలిక మృతి కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఓ పెద్ద మనిషి పాత్ర బయటపడింది.

 • Share this:
  తనపై అత్యాచారం చేయబోయిన యజమాని కొడుకును ప్రతిఘటించిన పాపానికి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టడంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారి కన్నుమూసిన విషయం తెలిసిందే. శరీరంలో డెబ్బై శాతం పైగా కాలిపోవడంతో.. దాదాపు 28 రోజుల పాటు వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ఈ మైనర్‌ బాలిక కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. కరోనా దెబ్బకు కుటుంబాన్ని పోషించడానికి ఆమె తండ్రి అప్పు చేయడమే ఆ చిన్నారి పాలిట పాపంగా మారింది. తమ గ్రామానికే చెందిన ఓ పెద్దమనిషి వద్ద ఆ బాలిక తండ్రి రూ.లక్షన్నర అప్పుగా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోవడంతో ఆ పెద్దమనిషి తన సొమ్మును రాబట్టుకోవడానికి ఆ బాలిక తండ్రికి ఓ సలహా ఇచ్చాడు. తనకు తెలిసిన వాళ్ల ఇంట్లో పనిలో పెడితే ఏడాదికి రూ.లక్షన్నర ఇస్తారని చెప్పాడు. అప్పు తీర్చలేక, ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆ తండ్రి ఇందుకు సరేనన్నాడు. దీంతో పనికి కుదిరిన చోట ఆ యజమాని అడ్వాన్సుగా ఇచ్చిన రూ. 50 వేలను అప్పిచ్చిన పెద్దమనిషే తనకు రావాల్సిన డబ్బుల కింద జమ చేసుకున్నాడు.

  అయితే ఇంత వరకు బాలిక తల్లిదండ్రులకు తెలిసే జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ పెద్దమనిషి తన సొమ్మును రాబట్టుకోడానికి అతితెలివి చూపాడు. మొదట పనికి కుదిర్చిన చోట సరిగా లేదని కంప్లైంట్‌ సృష్టించి.. మరోచోట రూ.2 లక్షలకు పనికి కుదిర్చాడు. ఇక్కడ అడ్వాన్సుగా ఇచ్చిన రూ.50 వేలను కూడా తన అప్పు కిందే జమ వేసుకున్నాడు. అయితే ఆ మైనర్‌ బాలిక పనిచేసే ప్రదేశాన్ని.. యజమానిని మార్చిన విషయం ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె ఆసుపత్రి పాలయ్యేదాకా ఈ విషయాన్ని దాచే ఉంచాడు. ఆ చిన్నారిపై కన్నేసిన కొత్త యజమాని సుబ్బారావు కుమారుడు ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఆ కామాంధుడు మీద పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. అయితే అదంతా చిన్న ప్రమాదం అని నమ్మబలికి తెలిసిన ఆసుపత్రిలో చేర్చి రహస్యంగా వైద్యం చేయించే ప్రయత్నంలో అసలు విషయం వెలుగుచూసింది. అయితే తన బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అప్పిచ్చిన పెద్దమనిషి తన బాకీని మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. బిడ్డ కోలుకుంటుందేమోనన్న ఆశతో ఈ విషయంపై ఆ తల్లిదండ్రులు పెద్దగా దృష్టి సారించలేదు.

  అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో తల్లిదండ్రులకు తెలియకుండా యజమానిని మార్చడం.. కనీసం వారికి మాటమాత్రంగానైనా చెప్పకుండా కేవలం తాను అప్పుగా ఇచ్చిన సొమ్మును రాబట్టుకోవడం కోసమే మితిమీరిన స్వార్థంతో అతను ప్రవర్తించిన తీరు ఇప్పుడు వెలుగుచూసింది. ఈ విషయంపై ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పు ఇచ్చి ఆ బాలిక నిండు జీవితం బలికావడంలో పాత్ర పోషించిన వ్యక్తి పేరాల రాములు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి 'న్యూస్-‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధికి తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అన్న అంశంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

  బాలికపై జరిగిన దౌర్జన్యం, రహస్య చికిత్స తదితర అంశాలపై ఇప్పటికే పోలీసు, వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. మైనర్‌ బాలికపై సాగిన దారుణం, అంత్యక్రియల విషయంలో అధికార యంత్రాంగం హడావుడి చేయడంపైనా ఇప్పటికే వామపక్ష పార్టీలకు చెందిన మహిళాసంఘాలు, పలు ప్రజా సంఘాలు జిల్లాలో నిరసన తెలుపుతునే ఉన్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని, రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం నివాసం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు.
  Published by:Nikhil Kumar S
  First published: