కొత్తగా పెళ్లైన దంపతులు నిండు నూరేళ్లు సుఖ, సంతోషాలతో గడపుతారని అందరూ భావిస్తారు. కాని వాళ్లు మాత్రం పెళ్లి వేడుకలతో సంతోషంగా మారిన ఇంటిని కనీసం 48గంటలు కూడా గడవక ముందే విషాదంగా మార్చారు. క్షణికావేశం, ఒకరిపై మరొకరికి ఆధిపత్య ధోరణి, అభిప్రాయాలు నచ్చకపోవడం అన్నీ ఒకేసారి వారిద్దరి మధ్య గొడవకు కారణమయ్యాయి. ఫలితంగా రిసెప్షన్‌కు వెళ్లాల్సిన నవ దంపతులు చనిపోయి స్మశానానికి వెళ్లారు. అత్యంత విషాద సంఘటన చత్తీస్‌గడ్ (Chhattisgarh)రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాయ్‌పూర్(Raipur)లోని బ్రీజ్‌నగర్‌లో రిసెప్షన్(Reception)కి రెడీ అయ్యేందుకు గదిలోకి వెళ్లిన దంపతుల మధ్య గొడవ జరగడంతో వరుడు పెళ్లికూతుర్ని పొడిచి చంపాడు. అటుపై అదే కత్తితో తాను పొడుచుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
రిసెప్షన్‌కి ముందే నవదంపతుల మధ్య ఘర్షణ..
పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాయని నానుడి ఉంది. కాని వాళ్ల పెళ్లి మాత్రం నరకంలో నిర్ణయించినట్లుగా తయారైంది. చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ బ్రీజ్‌నగర్‌లో అస్లాం అనే 24సంవత్సరాల యువకుడు, కహకషా బానో అనే 21సంవత్సరాల యువతిని ఆదివారం వివాహం చేసుకున్నాడు. వీరి రిసెప్షన్‌ని ఇరు కుటుంబ సభ్యులు కలిసి మంగళవారం రాత్రి జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రిసెప్షన్‌కి ముందు నూతన దంపతులు రెడీ అయ్యేందుకు గదిలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవపడ్డారు. పెళ్లి కూతురు మాటలు భరించలేకపోయిన అస్లాం కత్తితో ఆమెపై దాడి చేసాడు. కత్తిపోట్లకు గురైన వధువు గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తట్టారు. అయితే లోపల గడియపెట్టడంతో కిటికీలోంచి గదిలో జరిగిన దారుణాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు.
పెళ్లి ఇంట్లోనే చావులు ..
పెళ్లి కూతురు కహకషా బానోను కత్తితో పొడిచి చంపిన పెళ్లి కొడుకు తర్వాత తనకు తానే పొడుచుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరూ రక్తపు మడుగులో పడివుండటం చూసిన బంధువులు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. తిక్రాపరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్పాట్‌కి చేరుకున్న ప్రాధమిక విచారణలో వరుడే పెళ్లి కూతుర్ని చంపి అటుపై తాను ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. తలుపులు పగలగొట్టి మృతదేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Crime news, National News