వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారులే అని ధైర్యంగా ఉన్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం వారి పెళ్లికి ఒప్పుకోలేదు. సరికదా ఇద్దరికీ వేరే పెళ్లిళ్లు చేసేశారు. ఎడబాటుని భరించలేని ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నగర శివారు పడారుపల్లిలోని ఓ లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. అయితే వీరు నెల్లూరు నగర శివారు పడారుపల్లిలోని నందా లాడ్జిలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. అయితే కొద్ది గంటల తర్వాత వారు ఆ రూమ్‌లో ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వెలుగులోకి కొత్త విషయాలు
పెద్దలు పెళ్లికి ఆంగీకరించకపోవడంతో హరీష్, లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ ఇందులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ తో పాటు ఇష్టంలేని పెళ్లిళ్లు జరగడమే ఆత్మహత్యకు ప్రధాన కారణంగా విచారణలో వెల్లడైంది. హరీష్ కు తన మరదలితో, లావణ్యకు సైదాపురం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తో వివాహం అయినట్లు తెలుస్తోంది. ఇష్టంలోని పెళ్లి చేసుకున్న కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాము పనిచేస్తున్న గ్రామ సచివాలయం నుంచి బైక్ పై వచ్చిన హరీష్, లావణ్య.., పడారుపల్లిలోని నందా లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకులు కూడా వారు భార్యాభర్తలుగా భావించి రూమ్ అద్దెకిచ్చారు. వాళ్లిద్దరూ బైక్ పై రావడం, లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పోలీసులు నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఇటీవలే పెళ్లై వెంటనే భర్తను కోల్పోవడంతో హరీష్ భార్య కన్నీరుమున్నీరవుతోంది. చిన్నతనంలోనే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.