వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు రోజుల పసికందు మృతి.. కామారెడ్డిలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

నాలుగు రోజుల క్రితమే ఈ  లోకంలోకి అడుగిడిన పసికందు ఇంకా కళ్లు కూడా తెరవకముందే కన్నుమూసింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రి ఈ నిర్వాకానికి కారణమైంది. వైద్యుల నిర్లక్ష్యం ఆ పసిపాపకు ప్రాణ సంకటం అయింది.

 • News18
 • Last Updated :
 • Share this:
  కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితమే ఈ  లోకంలోకి అడుగిడిన పసికందు ఇంకా కళ్లు కూడా తెరవకముందే కన్నుమూసింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రి ఈ నిర్వాకానికి కారణమైంది. వైద్యుల నిర్లక్ష్యం ఆ పసిపాపకు ప్రాణ సంకటం అయింది. ఆమెకు ఇచ్చిన యాంటీ బయోటిక్ టీకా వికటించడంతో ఆ ఆడ శిశువు ఇంకా అమ్మనాన్నలను చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం.. ఎన్నో ఆశలతో తమ ఇంటికి లక్ష్మీ దేవి అడుగిడిందని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని కన్నీరు మిగిల్చింది.

  కామారెడ్డి లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. బాన్సువాడ మండలం జక్కలదాని తండాకు చెందిన శ్రీనివాస్ భార్య లీలకు ఐదు రోజుల కింద పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో అతడు.. తన భార్యను బాన్సువాడ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ లీల కు డెలివరీ చేసారు. ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆడపిల్ల పుట్టిన ఆనందం ఆ దంపతులకు ఎక్కువ కాలం నిలువలేదు. నాలుగు రోజుల తర్వాత ఆ పాప మృతి చెందింది.

  దీనికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని ఆ బంధువులు ఆరోపణ. ఆ పాపకు ఇచ్చిన యాంటీ బయోటిక్ ఇంజక్షన్ వికటించే ఆ పాప చనిపోయిందని వారు అంటున్నారు. దీనికి ఆ ఆస్పత్రి సిబ్బందిదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ దీనికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన వారి కుటుంబసభ్యులు.. సదరు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పసి పాప చనిపోయిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పాప మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తున్నారు. వారిని చూసినవారికి ఆ దృశ్యం కంటతడి పెట్టిస్తున్నది.
  Published by:Srinivas Munigala
  First published: