NELLORE DISTRICT NEWS ONGOING RESCUE OPERATION FOR 3 YEARS BOY SANJU NGS
Boy Missing: సంజూ నువ్వు ఎక్కడున్నావ్.. పది రోజులైనా దొరకని ఆచూకీ..
పది రోజులైనా లేని ఆచూకీ
Boy missing: ఒకటి రెండు రోజులు కాదు.. మూడేళ్ల చిన్నారి మిన్సై పది రోజులు దాటింది. అయినా ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతానికి బాలుడు క్షేమంగా ఉన్నా.. అసలు ఎక్కడున్నాడు.? తప్పిపోయి ఎక్కడైనా చిక్కుకున్నాడా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..?
సంజూ ఎక్కడున్నావ్?. నీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.. బుడిబుడి అడుగులతో అమ్మా అంటూ నా కొంగు పట్టుకుని తిరుగుతుంటే చూడాలని ఉంది బిడ్డా.. ఇన్ని రోజులు చూడకుండా నేనెలా బతకాలి తండ్రి.. నీ కోసం మేమే కాదు.. కాలనీవాసులు, పోలీసులు రాత్రీపగలు తేడా లేకుండా వెతుకుతున్నాం.. త్వరగా కనిపించు నాన్నా అంటూ తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి సంజు తల్లిదండ్రుల రోధిస్తున్నారు. వారి కన్నీరు చూసిన వారికి కళ్లంట నీరు ఆగడం లేదు. ఒకటి రెండు రోజులు కాదు 10 రోజులైనా ఆచూకీ దొరకకపోవడం వేధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని వెలుగొండ అడవుల్లో అదృశ్యమైన మూడేళ్ల బాలుడు సంజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఆశా జనక ఫలితం కనిపించడం లేదు. ఉయ్యాలపల్లితో పాటు పరిసర గ్రామాల్లో యువకులని బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసు, యువకుల బృందాలు విడిపోయి గాలిస్తున్నారు. ఉయ్యాల పల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో గాలింపు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ లకు బాలుడి సమాచారం అందించారు. వాల్ పోస్టర్లను సోషల్ మీడియాకు విడుదల చేశారు. అలాగే బస్సు, ఆటోలకు పోస్టర్లను అతికించారు.
కలువాయి మండలం ఉయ్యాలపల్లి దళితవాడకు చెందిన దండు బుజ్జయ్య, లక్ష్మమ్మకు ముగ్గురు మగపిల్లలున్నారు. వారిలో సంజు రెండో బిడ్డ. బుజ్జయ్య గొర్రెలు మేపుతాడు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. గొర్రెలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తున్న బుజ్జయ్య వెంట చిన్నారి మూడేళ్ల సంజు కూడా నిత్యం వెళ్లేవాడు. తండ్రితో కొంత దూరం వరకు వెళ్లిన చిన్నారిని తిరిగి ఇంటికి చేర్చడం నిత్యం జరుగుతుండేది. కానీ గత నెల 29వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో చిన్నారి తండ్రి వెళ్లిన కాసేపటికి అటవీ ప్రాంతం వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటినుంచి సంజు ఆచూకీ లభించలేదు.
సంజు ఆచూకీ కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రోజూ సంజు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉయ్యాలపల్లి తెగచర్ల పరిసర ప్రాంతాలతోపాటు, సమీప అటవీ ప్రాంతంలో పోలీస్ బృందాలు తీవ్రస్థాయిలో గాలించాయి. రెండు రోజుల క్రితం పోలీస్ జాగిలాన్ని రప్పించి అడవిలో తిప్పారు. ముందుగా బాలుడు వాడుతున్న చెప్పులను వాసన చూపించారు. జాగిలం అక్కడి నుండి రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో తిరిగి ఆగిపోయింది. డాగ్ స్క్వాడ్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే 10 రోజులు గడచినందున దుస్తులు తదితరాల కంటే చెప్పుల ద్వారా జాగిలాలు వాసనను బాగా పసిగట్టగలవని తెలిపారు. జాగిలం బాగా అలసిపోయిందని, విశ్రాంతినిచ్చారు. మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. అలాగే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు వేయించి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు.
సంజును ఎవరైనా అపరిచితులు ఎత్తుకెళ్లి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తల వెంట్రుకల కోసం ఊరూరా తిరిగే కొందరు అపరిచితుల వ్యక్తులు బిడ్డను అపహరించి విక్రయించుకునే అవకాశం కూడా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తప్పిపోయిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్ డంప్ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. సంజు ఆచూకీ లభ్యం కాకపోవడం.. పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో కూడా బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో ఎక్కడో చోట క్షేమంగా ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తప్పక ఆనవాళ్లు లభించేవని, త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.