జాతీయ జెండా వివాదం.. రైతుల నిరసనల రోజు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులపై కేసు..

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిరసనల్లో ఓ రైతు మరణించాడు. అతడికి ఫిబ్రవరి 2వ తారీఖున స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల వీడియోను చూసిన పోలీసులు ఆ రైతు తల్లి, సోదరుడిపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కారణమేంటంటే..

 • Share this:
  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతుల నిరసనలకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ ఇటు రైతులు, ఆ చట్టాల వల్ల రైతులకే మేలంటూ అటు ప్రభుత్వం చెబుతుండటంతో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నా అవి పరిష్కారాన్ని చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో జరిగిన రైతుల నిరసనల్లో మరణించిన ఓ రైతు కుటుంబ సభ్యులపై కేసు నమోదయింది. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ పతాకాన్ని వాడటంపై ఆ వ్యక్తి తల్లి, సోదరుడితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సెహ్రామౌ ప్రాంతానికి చెందిన బల్జీంద్ర అనే రైతు, ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన దీక్షలకు మద్దతు తెలపాలనుకున్నాడు. జనవరి 23న తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వెళ్లాడు. జనవరి 25న ఘజియాపూర్ పరిధిలో జరిగిన రైతుల నిరసనల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో బల్జీంద్ర మరణించాడు. అతడి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఫిబ్రవరి 2వ తారీఖున అతడి కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. తమ కుటుంబ సభ్యుడేనని చెప్పడంతో ఆ మృతదేహాన్ని వారికి అప్పగించారు.

  బల్జీంద్ర మృతదేహానికి వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో జాతీయ జెండాను బల్జీంద్ర మృతదేహంపై కప్పి అంతిమయాత్రను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే జాతీయ జెండాను వాడటంపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. జాతికి విశేష సేవలు చేసిన వారి పార్థీవ దేహంపై మాత్రమే జాతీయ జెండాను ఉంచాలన్న నిబంధన ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఆర్మీ జవాన్లు వంటి వారికి మాత్రమే జాతీయ జెండాను వాడుతుంటారు. బల్జీంద్ర మృతదేహంపై జాతీయ జెండాను ఉంచడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ ఘటనపై ఘజియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బల్జీంద్ర తల్లి జస్వీర్ కౌర్, సోదరుడు గుర్వీందర్ తో పాటు మరో గ్రామస్తుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
  Published by:Hasaan Kandula
  First published: