చెరువులో అక్రమంగా పట్టిన నీటి బాతులు, మరికొన్ని నీటి పక్షులను మార్కెట్లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను నల్లగొండ అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం గజలాపురానికి చెందిన సింగం శ్రీనయ్య, ఆయన భార్య సింగం సైదమ్మ, తవియబోయిన సైదులు కలిసి మిర్యాలగూడ రేంజ్లోని పెద్దదేవులపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అక్కడ నీటి బాతులు, ఉల్లంకి పక్షులను అక్రమంగా పట్టుకున్నారు. వాటిని నల్లగొండ రష్మత్నగర్లో విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరు నీటి కొంగలు, 8 ఉల్లంకి పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఈ నీటి పక్షులను పట్టి విక్రయించడంపై నిషేధం ఉంది. ఈ నీటి పక్షలను పట్టుకుని మార్కెట్లో విక్రయించడం నేరమన్న విషయం తమకు తెలీదని నిందితులు తెలిపారు. దీంతో ముగ్గురు నిందితులకు రూ.50 వేల జరిమానా విధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
చట్టం ఏం చెబుతోంది?
అటవీ ప్రాంతంలో నీటిపక్షులను వేటాడడం నేరం. వన్యప్రాణ సంరక్షణ చట్టం కింది దోషులకు జైలుశిక్ష ఉంటుంది. గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న నీటి పక్షుల వేటను నియంత్రించేందుకు ప్రత్యేక అటవీశాఖ బృందాలు రాష్ట్రంలోని అన్ని అటవీప్రాంతాల్లోనూ పనిచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ నీటి పక్షులను వేటాడవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda