HOME »NEWS »CRIME »multilevel marketing fraudsters cheating common public in khammam district kmm mk

Alert: Digital app access హైలెవెల్‌ ఛీటింగ్‌.. దారుణంగా మోసపోతున్న నిరుద్యోగులు

Alert: Digital app access హైలెవెల్‌ ఛీటింగ్‌.. దారుణంగా మోసపోతున్న నిరుద్యోగులు
ప్రతీకాత్మక చిత్రం

లెర్న్‌.. ఎర్న్‌.. అండ్‌ గ్రో విత్‌ ఇండియాస్‌ నెం.1 క్యాష్‌ బ్యాక్‌ యాప్ అంటూ.. ఫుల్‌ టైం అయినా.. పార్ట్‌ టైం అయినా.. ఎనీ టైం.. మీ వీలున్నప్పుడు ఇంట్లో కూర్చొని పనిచేసుకుపోండి.. మీ ఆదాయం మీరు పట్టుకుపోండంటూ ఆకర్షణీయమైన మాటలతో వల వేస్తారు.

 • Share this:
  ఇంట్లో కాలు బయటపెట్టొద్దు.. ఎవరి దగ్గరకు వెళ్లొద్దు.. ఎవరినీ మోటివేట్‌ చేయొద్దు.. పైసా ఖర్చు లేదు. ఒంటికి చెమట పట్టదు. నెలకు తక్కువలో తక్కువ రూ.50 వేల నుంచి లక్ష దాకా ఈజీగా సంపాదించుకోండి.. ఉదయం నిద్రలేచి సెల్‌ఫోన్‌ చూడగానే మెసేజ్‌ల సారాంశం ఇదీ. తొలుత సాధ్యం కాదని అనిపించినా.. మనదేంపోయింది.. వాళ్లిచ్చిన నెంబరుకు ఓ ఫోన్‌ చేస్తే పోలా అనుకుంటూ ఫోన్‌ కొట్టగానే గుడ్‌ మార్నింగ్‌ అంటూ మర్యాద.. మన్ననతో కూడిన స్వరం.. మల్టీ నేషనల్‌ కంపెనీలో మార్కెటింగ్‌ అంటూ మొదలు పెట్టి.. చివరకు మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ దాకా తీసుకొచ్చి.. కొద్దిగా ఆశ.. కొద్దిగా డౌట్‌లతో .. మొత్తానికి కాస్త రిస్కు చేస్తే వైట్‌కాలర్‌గా ఇంట్లో కూర్చొని చేతినిండా సంపాదించొచ్చు.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. రోజుకు ఐదు వేల నుంచి పదివేల దాకా.. నెలకు తక్కువలో తక్కువ రూ.లక్ష నుంచి రెండు లక్షల దాకా.. హీనపక్షంగా ఏభై వేలు.. ఈ రోజుల్లో ఏ పెట్టుబడి లేకుండా ఎవరు మాత్రం ఇస్తున్నారు చెప్పండంటూ.. సూత్రీకరణలు.. ఇది చాలు ఓ నిరుద్యోగిని వలలో పడేయడానికి.. బీటెక్కో.. ఎంటెక్కో చదివి ఇంట్లో తిని బలాదూర్‌ తిరుగుతున్నావన్న నిందలు పడలేక.. సమాజం చూసే చిన్నచూపు భరించలేక ఏదో ఒకటి చేయాలన్న కసిగా ఉన్న సమయంలో ఓ చిన్న ఆసరా దొరికినట్టు ఫీలవుతున్నారు.. అక్కడే మోసాలకు ఆసరా దొరుకుతోంది. తాము దారుణంగా మోసపోతున్నామని తెలీకుండానే మల్టీలెవెల్‌ మార్కెట్‌ వలలో చిక్కుకుపోతున్నారు నిరుద్యోగులు..

  లెర్న్‌.. ఎర్న్‌.. అండ్‌ గ్రో విత్‌ ఇండియాస్‌ నెం.1 క్యాష్‌ బ్యాక్‌ యాప్ అంటూ.. ఫుల్‌ టైం అయినా.. పార్ట్‌ టైం అయినా.. ఎనీ టైం.. మీ వీలున్నప్పుడు ఇంట్లో కూర్చొని పనిచేసుకుపోండి.. మీ ఆదాయం మీరు పట్టుకుపోండంటూ ఆకర్షణీయమైన మాటలతో వల వేస్తారు. పాపం నిరుద్యోగులు పడిపోతుంటారు. అసలే ఉద్యోగాలు లేక.. పైపెచ్చు కోవిడ్‌ కారణంగా ఉన్న చిన్నచితక ఉద్యోగాలు ఊడిపోయి నిస్సహాయంగా ఉన్న వారిని టార్గెట్‌ చేస్తూ వల పన్నుతున్నారు. తీరా ఫోన్‌ చేయగానే మీ పట్టణంలో.. లేదా దగ్గర్లోని పట్టణంలోని ఫలానా హోటల్‌లో ఒకరోజు ఇంట్రడక్షన్‌ సెషన్‌ ఉంది.. వచ్చి కాసేపు కూర్చొని మాతో లంచ్‌ చేసి వెళ్లండంటూ ఆహ్వానిస్తారు. ఇంకేముంది అక్కడకు వెళ్లగానే రకరకాల పేర్లతో ప్రొడక్టులను.. మార్కెటింగ్‌ వ్యూహాలను విప్పుతారు. మీ ఊళ్లోనే పెట్రోల్‌ బంకులు.. లీడింగ్‌ పచారీ షాపులు.. రెస్టారెంట్లు.. చివరకు మాంసం దుకాణాలతో కూడా టైఅప్‌ పెట్టుకున్నామని.. మీరు ఏంకొన్నా అక్కడే కొనాలని.. మీవాళ్లను అక్కడే కొనిపించాలని చెబుతారు. దీనికోసం డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లలో యాక్సెస్‌ కోసం కొంత పేమెంట్ చేయాలని అభ్యర్థిస్తారు.  మల్టీ లెవల్ మోసం...

  ఈ మొత్తం ఎంరాల్డ్‌.. డైమండ్‌.. గోల్డ్‌.. సిల్వర్‌.. ఇలా రకరకాల కేటగిరీలుగా రూ.5000 నుంచి 2000 దాకా ఏదైనా ఆప్ట్‌ చేసుకోవచ్చు. ఇది కేవలం యాప్‌ రూపకల్పన కోసం చేసిన ఖర్చులో మీ వంతుగా ఇస్తున్నారని.. దీన్ని బట్టే ఆదాయంలో పర్సెంటేజి నిర్ణయమవుతుందని నమ్మిస్తారు. ఇలా ఇక టౌన్‌లో జరిగే ఒక సెషన్‌లో తక్కువలో తక్కువ పాతిక నుంచి ఏభై మందికి పైగా డిజిటల్‌ యాప్‌ యాక్సెస్‌ కోసం చెల్లింపులు చేస్తారు. చెల్లింపులు కూడా గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా ఏదైనా ఒక ప్లాట్‌ఫాం ద్వారా తీసుకోవడం ద్వారా మరింత పారదర్శకతను ప్రదర్శిస్తుంటారు. అక్కడ ఎవరి ఫోన్‌ నెంబరు ఉండదు. 'క్యుఆర్‌' కోడ్‌ ద్వారా చేసే పేమెంట్లు ఎవరికి పోతాయో ఎవరికీ తెలీదు. ఇలా ఎవరూ జవాబుదారీ లేని వసూళ్ల ద్వారా అందిన కాడికి సొమ్ముచేసుకుంటున్నారు.

  ఉచ్చులో పడ్డారో డబ్బులు గోవిందా...

  డిజిటల్‌ యాప్‌ యాక్సెస్‌ వచ్చాక పాయింట్లు యాడ్‌ అవుతాయని.. పాయింట్లు పెరిగేకొద్దీ మీ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ పెరుగుతుందంటారు.. పైపెచ్చు క్రౌన్‌ డైమండ్‌ స్టార్‌, డైమండ్‌ స్టార్‌.. గోల్డ్‌స్టార్‌ రాయల్టీ.. సిల్వర్‌ స్టార్‌ రాయల్టీ.. ఇలా రకరకాల పేర్లతో మరికొద్ది మొత్తాన్ని వసూలు చేసుకుని.. మీమీ పరిధిలో ఎవరు చేసే పేమెంట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ పైనైనా.. కరెంటు బిల్లులు.. ఫోన్‌బిల్లులు.. ఇతర ఏదైనా చెల్లింపుల వల్ల జరిగే లావాదేవీల పైనా పాయింట్లు యాడ్‌ అవుతాయని నమ్మిస్తారు. ఇలా కేటగిరీని బట్టి పాయింట్లు.. పాయింట్లను బట్టి పేమెంట్లంటూ.. భారీ బిల్డప్‌ ఇస్తుంటారు. చెప్పడం.. చెల్లింపుల అనంతరం యాప్‌ యాక్సెస్‌ అయిన వారితో అద్భుతమైన లంచ్‌ లేదా డిన్నర్‌ ఏర్పాటు చేస్తారు. ఒక సామాన్యుడు తన జేబులోని డబ్బుతో చేయలేని స్థాయిలో ట్రీట్‌.. ఇక నమ్మకపోవడానికి ఏముంటుంది..  ఇక చివర్లో చిన్న రిక్వెస్ట్ అంటూ మీ దగ్గరివారిని కూడా ఈ సారి మీటింగ్‌కు పంపండంటూ.. రిఫరెన్స్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తారు.. మనదేంపోయిందన్న ఆలోచనతో స్నేహితులు.. బంధువుల నెంబర్లు ఇచ్చి ఇంటికొచ్చేస్తారు..

  డిజిటల్ కేటుగాళ్లతో జాగ్రత్త....

  ఎన్నాళ్లు చూసినా.. ఏముంది ఉపయోగం.. ఇలా మీరు రెగ్యులర్‌గా చేసే కొనుగోళ్లపై వచ్చే పాయింట్ల వల్ల అకౌంట్‌ బ్యాలెన్స్‌ పెంచుకుంటారని.. మీలాగా డిజిటల్‌ యాప్‌ యాక్సెస్‌ పొందిన వాళ్లు చేసే ప్రతి కొనుగోలు.. ప్రతి ఖర్చు.. ప్రతి లావాదేవీ పైనా మీకు ఎంతోకొంత జమ అవుతుందన్న నమ్మకమే.. ఇతరులు సైతం పెట్టుబడి పెట్టి దాన్లోకి చేరడానికి ప్రేరేపిస్తుంటుంది. ఇలా స్నేహితులు.. బంధువులు.. ఇరుగుపొరుగువాళ్లు.. మనల్ని నమ్మే మనపై నమ్మకం ఉన్న వాళ్లు ఇలా అందరూ ఏదో ఒక స్థాయిలో పేమెంట్లు చేసిన తర్వాత కూడా .. డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లలో పాయింట్లు యాడ్‌ అవుతుంటాయి కానీ.. అవి డబ్బురూపంలోకి ఎప్పుడు మారతాయో.. ఎన్నడు మనకు ఉపయోగపడతాయోనన్న సంశయం మొదలవుతుంది. అడగడానికి ఎవరూ మిగలరు.

  మోసపోతున్న అమాయకులు, నిరుద్యోగులు...

  మనకు ఫోన్‌ వచ్చిన నెంబరుకు ఫోన్‌ చేస్తే ఎవరూ ఉలకరు.. పలకరు.. అప్పటికి గానీ అర్థం కాదు. మోసపోయామని.. మనం రిఫరెన్స్‌ ఇవ్వడం వల్ల మరికొందరు మోసానికి గురయ్యారని.. ఇలా ఖమ్మం, కొత్తగూడెం.. మహబూబాబాద్‌.. వరంగల్‌.. హన్మకొండ పట్టణాల్లో ఈ మధ్య కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. కానీ ఇవేవీ పోలీసు కేసుల దాకా రావడం లేదు. కారణం.. కొట్టింది చిన్నమొత్తం కావడం.. పైగా కొంత మనకు ఖర్చు పెట్టాడుగా అన్న సాఫ్ట్‌ కార్నర్‌.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మన రిఫరెన్స్‌ ఇవ్వడంవల్ల ఎంతోమంది కూడా ఇలా మోసపోయారన్న విషయాన్ని గమనించలేకపోవడమే.. ఇలాంటి మోసాలు.. చిన్నచిన్న మార్పులతో మళ్లీ మళ్లీ జరగడానికి కారణమవుతున్నాయి. కేవలం చైతన్యం ద్వారానే నష్టపోకుండా ఉండే వీలుంది తప్ప ప్రభుత్వం.. పోలీసులు ఇలాంటి మోసాలపై దర్యాప్తులు చేయాలన్నా.. అదుపు చేయాలన్నా కష్టసాధ్యమైన పని అంటున్నారు నిపుణులు. సో యూత్‌.. పారాహుషార్‌.
  Published by:Krishna Adithya
  First published:January 25, 2021, 12:26 IST

  टॉप स्टोरीज