భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో బలవంతంగా సెక్స్ చేయడానికి భర్త చేసే ప్రయత్నం అత్యాచారంగా పరిగణించాల్సిందేనని, ఇంటి అవసరాలు పిల్లల పోషణకు డబ్బులు ఇస్తాననే సాకుతో ఆమెను బలవంతపెట్టినా.. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత భర్తకు వ్యతిరేకంగా ఆమె రేప్ కేసు పెట్టవచ్చంటూ సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు చెప్పింది. అయితే కీచక భర్తను చట్టపరంగా కాకుండా ఇతర మార్గాల్లో శిక్షించాలనుకుంటే మాత్రం బాధితురాలైన ఆ మహిళ నేరస్తురాలిగా చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. మధ్యప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం దీనికి సోదాహరణగా నిలిచింది. బలవంతపు సెక్స్ భరించలేని స్థితిలో ఓ భార్య కోపోద్రిక్తురాలై కత్తితో భర్త పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటనలో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు పెట్టారు. సంచలనంగా మారిన ఈ కేసు వివరాలను జతారా పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు..
మధ్యప్రదేశ్ లోని టికామ్ఘర్ జిల్లా కేంద్రంలోని జతారా పోలీస్ స్టేషన్ లో మొన్న ఆదివారంనాడు ఓ కీలకమైన కేసు నమోదైంది. 26ఏళ్ల వ్యక్తి తన భార్య(24)పై ఫిర్యాదు చేశాడు. ఈనెల 7వ తేదీన ఇంట్లో సెక్స్ కోసం ప్రయత్నించగా, భార్య కత్తితో పురుషాంగాన్ని కోసేసిందని, రక్తం కారిపోతున్న స్థితిలో ఆస్పత్రిలో చేరానని, ఆపరేషన్ కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. డాక్టర్ల రిపోర్టులు పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అవతలి కోణం తెలిసింది..
టికామ్ఘర్ పట్టణంలోని రాంనగర్ కు చెందిన ఆ వ్యక్తికి 2019లో ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. క్రమంగా అవి పెద్దవి కావడంతో పరిస్థితి తన్నుకునేదాకా వెళ్లింది. ఒక దశలో భర్త ఆగడాలను భరించలేనంటూ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ఇరు కుటుంబాలు, కుల పెద్దలు జోక్యం చేసుకొని ఆ జంటకు సర్దిచెప్పారు. గొడవలు పెట్టుకోకుండా బుద్ధిగా సంసారం చేసుకోండంటూ కాంప్రమైజ్ చేసి పంపారు. దీంతో కొద్ది కాలం కిందటే ఆమె భర్త దగ్గరికి తిరిగొచ్చేసింది. మళ్లీ కొద్ది రోజులకే ఇద్దరి కొట్లాట మొదలైంది. ఈక్రమంలోనే..
ఈనెల 7న ఇంట్లో అనూహ్య ఘటన జరిగింది. తనకు ఇష్టం లేదని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా దుస్తులు తొలగించి, పశువు మాదిరిగా బలవంతంగా సెక్స్ చేయడానికి ప్రయత్నించాడని భార్య పోలీసులకు వివరణ ఇచ్చుకుంది. బలవంతపు సెక్స్ భరించలేక పట్టరాని కోపంలోనే తానీ పని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల సంగతి ఎలా ఉన్నా, ఒక వ్యక్తిని మారణాయుధంతో ప్రమాదకరంగా గాపర్చడం నేరం కిందికే వస్తుందని, కాబట్టే ఆమెపై ఐపీసీ సెక్షన్ 324 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జతారా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ త్రివేంద్ర త్రివేది తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Madhya pradesh