Home /News /crime /

RRR: ఎంపీ రఘురామ కేసులో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసులు

RRR: ఎంపీ రఘురామ కేసులో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసులు

ఎంపీ రఘురామ (ఫైల్ ఫోటో)

ఎంపీ రఘురామ (ఫైల్ ఫోటో)

ఎంపీ రఘురామ అరెస్టు వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. తనను ఏపీ పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారని చెబుతున్న ఎంపీ.. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసులు పంపారు.. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి..

  ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు ఎంపీ రఘు రామకృష్ణంరాజు. హస్తిన వేదికగా అస్త్రాలు వేస్తున్నారు. ఆయనకు పరిచయం ఉన్న అందర్నీ కలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరికీ లేఖలు రాశారు. తనను పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారూ అంటూ ఆ లేఖలో రాశారు. ఇప్పటికే ఆ లేఖలతో జాతీయ స్థాయిలో ఆయనకు మద్దతు పెరుగుతోంది. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు దాదాపు ఎంపీలందరికీ లేఖలు రాశారు. దీనిపై చాలా మంది తీవ్రంగా స్పందించి.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

  తాజాగా.. సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్‌ నోటీసు పంపారు. తన అరెస్ట్‌ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్‌ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ ఒకింత హెచ్చరించారు. అయితే ఈ లేఖపై ఇంతవరకూ సునీల్ స్పందించలేదు. ఆయన రియాక్ట్ అయితే ఏమంటారో మరి.

  ఇటీవలే నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయ్యింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి.. అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి కుమారుడు భరత్‌ ఫిర్యాదు చేయడంతో.. నోటీసులు జారీ చేసింది.. దీంతో రెండు రోజుల్లో పోలీసులు ఎలాంటి నివేదిక ఇస్తారా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.

  మరోవైపు జాతీయ స్థాయిలో రఘురామకృష్ణంరాజుకు మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. లోక్‌సభ సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీశ్‌ భార్య. ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చాలా చెడు ప్రభావం చూపిస్తుందన్నారు. సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని, జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

  ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఇటు ఏపీ పోలీసులతో పాటు ప్రభుత్వానికి కూడా కొన్ని చికాకులు తప్పకపోవచ్చనిపిస్తోంది. ఆయనకు గాయాలు ఉన్నాయంటూ ఆర్మీ వైద్యాధికారులు ఇచ్చిన మెడికల్ రిపోర్టుతో పోలీసులు కాస్త చిక్కుల్లో పడ్డారు. అలాగే ఎయిమ్స్ వైద్యులు సూచనలు చూస్తుంటే.. ఈ కేసులో ఏపీ పోలీసులతో పాటు.. హైకోర్టు సూచనల మేరకు మొదట ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ ఇచ్చిన వైద్యాధికారులకు కూడా చిక్కులు తప్పవని రఘురామ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు