Andhra Pradesh: చిన్నారికి జలుబు మందు తెచ్చేందుకు బయటకు వెళ్లింది.. పాపం అమ్మే దూరమయ్యింది

చిన్నారికి దూరమైన తల్లి

పాపం చిన్నారికి జలుబు చేసిందని అమ్మ తల్లఢిల్లింది. చిన్నారి అలా ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయింది.. దీంతో భర్త అర్థరాత్రి ఎందుకు అని వారించినా.. మందు తేడానికని ఆ అమ్మ బయటకు వెళ్లింది.. కానీ చివరికి ఆ పాపకు అందనంత దూరానికి వెళ్లిపోయింది..

  • Share this:
    మనిషి జీవితంలో.. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు.. క్షణంలోనే అన్ని తారుమారు అవుతున్నాయి. విధి మనుషుల జీవితాలతో వింత ఆట ఆడుతోంది. తాజాగా రెండేళ్ల చిన్నారికి చిన్న జలుబు చేయడంతో.. ఆ బేబీకి ఏదీ కాకాడదనే ఆరాటంతో.. అమ్మ మెడిసిన్ తెచ్చేందుకు వెళ్లింది. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆరాటపడింది కానీ.. ఊహించని విధంగా ఆ తల్లి ప్రమాదంలో ప్రాణాలు విడవడంతో అందరి మనసులను కదిలిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరానికి చెందిన 29 ఏళ్ల యాస్మిన్, శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. చిన్నారికి జలుబు చేయడంతో గురువారం అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. చిన్నారి ఒంట్లో బాలేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. వెంటనే భర్తను లేపి పాపకు మెడిసిన్ తీసుకురావాలని సూచించింది. ఉదయం హాస్పిటల్‌కు వెళ్దామని, ఏం కాదులే అంటూ భర్త చెప్పాడు. కొంత సేపటి తర్వాత చిన్నారిని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందైతే పాప ప్రాణానికే ముప్పు కలుగుతుందేమో అని ఆందోళన చెందింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మెడిసిన్ చీటీ పట్టుకొని తన స్కూటీపై మెడికల్ షాపుకు బయల్దేరింది. చంద్ర ఆసుపత్రి సర్కిల్ దాటగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యాస్మిన్‌ స్పాట్‌లోనే మృతిచెందింది.

    విషయాన్ని గమనించిన రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై జగదీశ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. యాస్మిన్‌ డెడ్‌బాడీని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. గస్తీ కానిస్టేబుల్‌ శివకుమార్‌ యాక్సిడెంట్‌కు కారణమైన కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ ఏమైపోతుందోనన్న భయంతో అర్ధరాత్రి పరుగులు పెట్టిన ఆ మహిళను యాక్సిడెంట్ రూపంలో మృత్యువు వెంటాడటం అందర్నీ కన్నీరు పెట్టేలా చేస్తోంది.

    పాపం చిన్నారి జలుబు తగ్గడం సంగతి అటు ఉంచితే.. ఇప్పుడు ఆ పాప ఆలనా పాలనా చూసుకోవడడానికి కన్న తల్లే లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..
    Published by:Nagesh Paina
    First published: