ఒకప్పుడు పిల్లల జీవితాలను నిలబెట్టడానికి గొప్ప త్యాగాలను చేసే తల్లులను చూశాం. కానీ ఇప్పుడు తల్లుల కామదాహానికి పిల్లలు బలైపోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. మామ(భర్త తండ్రి)తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. వాళ్ల చీకటి వ్యవహారాన్ని చూసిందనే కారణంతో కన్నబిడ్డను దారుణంగా హతమార్చిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల సంచలనం రేపింది. దాదాపు అలాంటిదే మరో ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. బద్వేలు పోలీసుల కథనం ప్రకారం..
తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే ఓ తల్లి అంతం చేసింది. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బద్వేలు పోలీసులు చెప్పిన వివరాలివి..
బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగపెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకటసుజాత (17)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివింది. రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అలియాస్ శీనయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన సుజాత తల్లిని మందలించింది. దీంతో రమణమ్మ కుమార్తెను అంతమొందించాలని నిర్ణయించుకుంది.
ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటోడ్రైవర్ మేకల మల్లెంకొండయ్యతో కలిసి కూతుర్ని అడ్డుతప్పించుకునే పథకం పన్నింది రమణమ్మ. అందరూ కలిసి గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న వెంకట సుజాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత మల్లెంకొండయ్యకు చెందిన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేసి వచ్చారు. తర్వాత సుజాత కనిపించడం లేదని, తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించారు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో సుజాత మృతదేహం లభ్యమైంది. అయితే తండ్రి ప్రవర్తన నచ్చక వెంకటసుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసిందా తల్లి. కాగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దీనిని హత్య కేసుగా మార్చారు. లోతైన దర్యాప్తుతో మిస్టరీని ఛేదించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన అర్బన్ సీఐ రామచంద్ర, ఎస్‌ఐ వెంకటరమణలను జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లు అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.