దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నా... మారుమూల గ్రామాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఈ విధంగా వాటిని నమ్ముతూ ప్రాణాలను తీసుకోవడమో.. లేక ప్రాణాలను తీయడమో చేస్తున్నారు. ఇలా ఎవరో తనకు నాగదోషం ఉందని చెప్పడంతో రోజూ పూజలు చేస్తూ.. తన కన్న బిడ్డను గొంతు కోసి బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి అదే తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన చాలా రోజులకు ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి ఇప్పడు ఆరునెలలు. ఆ చిన్నారికి ఈషా అని నామకరణం చేశారు. అయితే కొన్నినెలల కిందట గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి.. భారతికి నాగదోషం ఉందని చెప్పడంతో భయపడిపోయింది. దీనికి పరిష్కారం ఏంటని అడగడంతో రోజూ పూజలు చేయాలని సలహా ఇచ్చాడు.
దాంతో ఆమె రోజూ పూజలు చేయడం ప్రారంభించింది. అలా ప్రతీ రోజు పూజలు చేస్తూ ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడంతో పాటు ఆందోళనకు కూడా గురయ్యేది. చీటికి మాటికి కోపంతో ఊగిపోయేది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బిడ్డ చిన్నారి ఈషాను చూడగా ఆమెకు నాగుపాములాగా కనిపించింది. భయపడిపోయిన ఆమె చిన్నారి ఈషాను తీసుకొని దేవుడి చిత్రపటాల ముందు ఉంచింది. చిన్నారిని అక్కడ పడుకోబెట్టి పూజలు చేయడం ప్రారంభించింది . పూజలు చేసిన అనంతరం కత్తితో చిన్నారి ఈషా గొంతు కోసి బలితీసుకుంది. భయపడుతూ.. రోధిస్తూ ఆమె ఇంటి నుంచి భయటకు వచ్చి తన బిడ్డను హతమార్చినట్లు స్థానికులకు తెలిపింది.
అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime, Crime news, Mantras, Mother killed her baby, Suryapeta, Telangana, Telangana crime