తన కడుపున పుట్టిన పిల్లల ఆరోగ్యం విషయంలో ఆమె కఠినాత్మురాలిగా మారింది. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి కిరాతకానికి ఒడిగట్టింది. ఏ పాపం తెలియని ఏడాది వయసున్న కూతుర్ని కన్నతల్లే చంపి..నేరాన్ని ప్రమాదవశాత్తుగా చిత్రీకరించాలని చూసింది. కట్టుకథ అల్లినప్పటికి పోలీసుల దగ్గర అతక్కపోవడంతో అసలు నిజం కక్కింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా అంతా జరిగిపోయిన తర్వాత బోరున విలపించింది. జనగామ(Jangaon)జిల్లాలో సోమవారం(Monday)చైన్ స్నాచింగ్(Chain snatching)కేసులో ఎంక్వైరీ చేసిన పోలీసులు మర్డర్(Murder) కేసుగా తేల్చడం స్థానికంగా కలకలం రేపింది.
బాధలో నేరానికి పాల్పడ్డ తల్లి ..
జనగామ జిల్లా అంబేద్కర్ కాలనీలో సోమవారం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కాలనీలో నివాసముంటున్న ప్రసన్న తన మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు చైన్ స్నాచర్ ప్రయత్నించాడని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తన సంకలో ఉన్న ఏడాది బిడ్డను సంపులో పడేసి పారిపోయాడని అరుస్తూ అందరికి తెలిపింది. ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రసన్న భర్త నడిగోటి భాస్కర్‌కు విషయం తెలియడంతో వెంటనే ఇంటికి చేరుకున్నాడు. సంపులో పడిన పసిపాపను బయటకు తీశారు. అప్పటికే చిన్నారి తేజస్వి మృతి చెందింది. కాలనీలో నివసిస్తున్న వాళ్లందరికి గొలుసు దొంగ చేతిలో తన బిడ్డ ప్రాణాలు పోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసింది.
బిడ్డను చంపి కట్టుకథ..
చైన్ స్నాచింగ్ అనడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్తలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని పసిపాప తల్లి ప్రసన్నను ప్రశ్నించడంతో ఆమె చెప్పిన సమాధానంతో పోలీసులకు అనుమానం కలిగింది. భర్తను కూడా వివరాలు కోరడంతో పోలీసుల అనుమానం నిజమైంది. 12నెలల పసికందును తానే సంపులో పడేసి చైన్ స్నాచర్ పడేసినట్లుగా కట్టుకథ అల్లానని తల్లి ప్రసన్న అంగీకరించింది. ఎందుకు చంపాల్సి వచ్చిందని కోరడంతో తన మనసులో ఉన్న మనోవేదనను బయటపెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రసన్నకు నాలుగేళ్ల క్రితం జనగామకు చెందిన భాస్కర్‌తో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు సంతానం. బాబు నవనీత్‌కు మూడేళ్లు. పాప తేజస్వికి 12నెలలు.
7గంటల్లో నిజాన్ని రాబట్టిన పోలీసులు..
ఏడాది వయసున్న పాప తేజస్వికి బోర్లా పడటం,పాకడం కూడా రాకుండా కదల్లేని స్థితిలో ఉంది. మూడేళ్ల కొడుకుకి ఈమధ్యనే సుమారు 8లక్షలకుపైగా ఖర్చు చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. పసివాడి ఆరోగ్యం కూడా గాల్లో దీపంలా ఉంది. పుట్టిన ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడటం చూసిన తల్లి భరించలేకపోయింది. బ్రతికినంత కాలం ఇలాంటి బాధలు చూడాల్సి వస్తుందనే ఆలోచనతో ఏడాది వయసున్న కూతురు తేజస్విని సంపులో పడేసి చైన్ స్నాచర్ పడేసినట్లుగా డ్రామా ఆడినట్లుగా పోలీసులు ఆమె నోటితోనే చెప్పించారు. చైన్ స్నాచింగ్ కేసులో మర్డర్ మిస్టరీని చేధించారు పోలీసులు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డెత్ కేసులో మిస్టరీని పోలీసులు కేవలం ఏడు గంటల్లో చేధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mother killed her baby, Telangana crime news, Warangal