Woman Constable: 9 నెలల క్రితం కనిపించకుండాపోయిన లేడీ కానిస్టేబుల్.. చివరకు అక్కడ కనిపించడంతో అవాక్కైన పోలీసులు

లేడీ కానిస్టేబుల్ అంజనా

ఆమె ఒక కానిస్టేబుల్. 9 నెలల క్రితం కనిపించకుండాపోయింది. పోలీసులు అప్పటి నుంచి వెతుకులాట సాగిస్తే చివరకు ఆమె ఓ ఆలయం దగ్గర పూలు అమ్ముతూ కనిపించింది.

  • Share this:
    రాయ్‌పూర్: ఆమె ఒక కానిస్టేబుల్. 9 నెలల క్రితం కనిపించకుండాపోయింది. పోలీసులు అప్పటి నుంచి వెతుకులాట సాగిస్తే చివరకు ఆమె ఓ ఆలయం దగ్గర పూలు అమ్ముతూ కనిపించింది. కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆమె ఆలయం దగ్గర పూలు అమ్ముతూ కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకే తాను ఉద్యోగాన్ని వదులుకుని.. అందరికీ దూరంగా ఇక్కడకు వచ్చి పూలు అమ్ముకుంటూ ప్రశాంత జీవనం సాగిస్తున్నానని ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గర్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన అంజనా సాహిస్ మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. అందరితో మంచిగా ఉండేది.

    సహోద్యోగులతో కలుపుగోలుతనంతో మెలుగుతూ ఉన్న ఆమె 9 నెలల క్రితం రాయ్‌పూర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆమెకు సీఐడీలో పోస్టింగ్ ఇచ్చారు. అలా ఉన్న క్రమంలోనే.. ఉన్నట్టుండి ఒకరోజు అంజన కనిపించకుండా పోయింది. 2020, ఆగస్ట్ 21న ఆమె కనిపించకుండాపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. రాజేంద్రనగర్ పోలీసులు అంజనా ఆచూకీ కోసం వెతుకులాట సాగించారు. అంజనా ఇల్లు రాయ్‌పూర్‌లోని మహవీర్ నగర్‌లో ఉంది. ఇంట్లో వాళ్లకు గానీ, తోటి ఉద్యోగులతో గానీ ఒక్కమాట కూడా చెప్పకుండా అంజనా అదృశ్యమైంది. అంజనా మొబైల్ కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే వదిలేయడంతో ఆమె ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది.

    అంజనా కనిపించకుండాపోయిన కేసును సీరియస్‌గా తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషించారు. ఎట్టకేలకు పోలీసులకు ఆమె జాడ తెలుసుకునేందుకు ఒక అవకాశం దొరికింది. ఆమె ఇటీవల ఏ ఏటీఎంలో డబ్బు డ్రా చేసిందో తెలుసుకుంటే ఆమెను కనుగొనడం సులభమవుతుందని పోలీసులు భావించి బ్యాంకును సంప్రదించారు. ఆమె బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా.. అంజనా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ప్రాంతంలో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసినట్టు తెలిసింది. ఈ కేసులో అలా చివరికి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆ ఏటీఎం దగ్గరకు వెళ్లి ఆ సమీపంలోని దుకాణాల్లో అంజనా ఫొటో చూపించి.. ఈమెను ఎక్కడైనా చూశారా అని అడిగారు.

    ఆమెను కృష్ణుడి ఆలయం వద్ద చూసినట్లు కొందరు చెప్పడంతో అక్కడికి పోలీసులు వెళ్లి చూడగా.. ఆలయం బయట పూల అంగడి పెట్టుకుని పూలు, పూజా సామాగ్రి అమ్ముతూ అంజనా కనిపించింది. ఆమెను కలిసి.. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి ఇలా పూలమ్ముకుంటున్నావేంటని పోలీసులు అడిగారు. తమతో రావాలని పోలీసులు కోరగా వెళ్లేందుకు అంజనా నిరాకరించింది. ఆమె తల్లితో పోలీసులు ఫోన్ మాట్లాడించినా.. ఆమెకు కూడా అంజనా తాను రానని చెప్పేసింది. తనకు కుటుంబం గానీ, బంధువులు గానీ లేదని.. తాను ఇక్కడే ఇలా బతకాలనుకుంటున్నానని ఆమె చెప్పింది.

    ఇది కూడా చదవండి: Sad: చేతులెలా వచ్చాయో.. బ్యూటీపార్లర్ నడుపుతున్న ఈమె జీవితం ఇలా ముగిసిపోవడం దారుణం..

    కొందరు పై అధికారుల నుంచి ఎదురైన ఒత్తిళ్ల కారణంగా అంజనా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని.. కుటుంబపరంగా కూడా చికాకులు ఎదురవడంతో ఉద్యోగాన్ని వదిలేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. ఏ అధికారి వేధింపులకు గురి చేశాడో చెప్పాలని.. అసలు సమస్య ఏంటో వివరించాలని పోలీసులు అంజనాను కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఉద్యోగంతో విసిగిపోయానని.. పై అధికారుల నుంచి వేధింపులు కూడా తట్టుకోలేకపోతున్నాని.. బృందావన్ వెళ్లిపోయి అక్కడే బతకాలనుకుంటున్నానని అంజనా పలు సందర్భాల్లో తోటి ఉద్యోగుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కానీ.. అంజనా నిజంగా అదే నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.
    Published by:Sambasiva Reddy
    First published: