భువనేశ్వర్: ఒడిశాలో మహిళా టీచర్ మమతా మెహెర్ మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. కలహండి జిల్లాలోని మహాలింగ్లో నిర్మాణ దశలో ఉన్న స్టేడియంలో మమత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయి రోజులు గడుస్తుండటంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. కుటుంబ సభ్యులు ఆ మృతదేహం మమతదేనని గుర్తించారు. అయితే.. ఆ మృతదేహం మమతదో కాదో గుర్తించేందుకు ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపించారు. 11 రోజుల క్రితం మహిళా టీచర్ మమత అదృశ్యమైంది. ఆమెను హత్య చేసి.. నిర్మాణ దశలో ఉన్న స్టేడియం కింద పూడ్చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మమత కలహండి జిల్లాలోని మహాలింగ్లో ఉన్న సన్‌షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెను హత్య చేసిన కేసులో సదరు స్కూల్ మేనేజ్మెంటె కమిటీ ప్రెసిడెంట్ గోబింద సాహు ఏ1 నిందితుడిగా ఉన్నాడు. మమత సోదరుడి ఫిర్యాదుతో సాహుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్లో సెక్స్ రాకెట్ సాగిస్తున్న సాహు చీకటి దందా గురించి తన సోదరికి తెలిసిందని.. ఆమె ఎక్కడ ఈ విషయాన్ని బయటపెడుతుందోనని భయపడి ఆమెను చంపేశారని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాహు టిట్లాగర్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు తప్పించుకున్నాడు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. సింధ్కెల పోలీసులు నిందితుడి కారును సీజ్ చేశారు. సాహు ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును కూడా బాలంగిర్ ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిట్లాగర్ పోలీస్ బ్యారక్ నుంచి నిందితుడు గోవింద సాహు తప్పించుకోవడంతో అక్కడి సెక్యూరిటీ ఏర్పాట్లపై సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. నిందితుడు టౌన్ నుంచి తప్పించుకునే అవకాశం లేదని, పలుచోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని వీలైనంత త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. విధుల్లో నిర్లక్ష్యం వహించి నిందితుడు తప్పించుకునేందుకు ఆస్కారం కల్పించిన టిట్లానగర్ పోలీస్ బ్యారక్‌లోని ముగ్గురు కానిస్టేబుల్స్‌పై వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించి నిందితుడు తప్పించుకునేందుకు కారణమైన ముగ్గురు కానిస్టేబుల్స్ అయిన రాకేష్ బిశ్వాల్, దయా జానీ, రబీంద్ర ఝిలేనిని సస్పెండ్ చేసినట్లు టిట్లాగర్ ఎస్పీ తెలిపారు. లేడీ టీచర్ మమత మిస్సింగ్ ఒడిశాలో రాజకీయ ప్రకంపనలు రేపింది. లేడీ టీచర్ మిస్సింగ్ కేసులో హోం మంత్రి దివ్య శంకర్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాదు.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయిన గోవింద్ సాహుతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని, అందువల్ల మంత్రిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ ఎంపీ బసంత్ పండా డిమాండ్ చేశారు. ఏదేమైనా.. స్కూల్లో సెక్స్ స్కాండల్ వ్యవహారం, లేడీ టీచర్ మిస్సింగ్.. చివరికి హత్యకు గురవడం ఒడిశాలో సంచలనంగా మారింది.
Tags: Odisha, Private teachers, Women missing