Gang rape: మైనర్ బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. వీడియో చిత్రీకరించి పైశాచికం

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు చెప్పింది. ఒకరు రేప్ చేస్తుండగా.. మరొకరు ఫోన్‌లో వీడియో తీశారని చెప్పి కన్నీళ్లుపెట్టుకుంది.

news18-telugu
Updated: October 7, 2020, 3:03 PM IST
Gang rape: మైనర్ బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. వీడియో చిత్రీకరించి పైశాచికం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్ని వర్గాల ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నారు. రేపిస్ట్‌లను ఉరితీయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తున్న సమయంలోనే.. దేశంలో మరిన్ని ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్నో దారుణాలు తెరపైకి వస్తున్నాయి. చట్టాలంటే లెక్కలేకుండా.. శిక్షలంటే భయం లేకుండా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని బాడ్మేర్ (Barmer) జిల్లాలో ఘోరం జరిగింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాజస్థాన్‌లోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. బాధితురాలు తల్లిదండ్రులు ఓటు వేసేందుకు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దండగులు.. బాలికను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. పంట పొలాల్లోకి లాక్కెళ్లి.. ఒకరి తర్వాత మరొకరిగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఓటు వేసిన తర్వాత.. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారిని అడిగితే తమకు తెలియదని చెప్పారు. చివరకు ఊరి శివారులో.. రహదారికి కొంత దూరంలో అపస్మారస్థితిలో బాలిక కనిపించింది. స్థానికులతో సాయంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు.

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు చెప్పింది. ఒకరు రేప్ చేస్తుండగా.. మరొకరు ఫోన్‌లో వీడియో తీశారని చెప్పి కన్నీళ్లుపెట్టుకుంది. ఐతే వారెవరో తనకు తెలియదని.. ముఖానికి మాస్క్‌లు ధరించడంతో గుర్తు పట్టలేకపోయానని తెలిపింది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ గ్యాంగ్ రేప్‌పై మహిళా సంఘాలు భగ్గుమున్నాయి. పలువురు నేతలు ఆస్పత్రిలో బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 7, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading