Minor lover couple found hanging :ఉత్తర్ప్రదేశ్లో విషాద ఘటన జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు మైనర్లు ఓ గుడిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుదౌన్ జిల్లాలోని ఉస్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్సా నాగ్లా గ్రామంలో ఓ ఆలయంలోని ఓ గదిలో శనివారం తెల్లవారుజామున మైనర్ లవర్స్ మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఉదయం ఆలయానికి వచ్చిన బాలిక తల్లి రెండు వేర్వేరు చీరల సహాయంతో వేలాడుతున్న మృతదేహాలను గమనించి తన ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిందని ఆలయ పూజారి నెమి దాస్ పోలీసులకు తెలిపారు. అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పూజారి చెప్పారు. కాగా,ఆలయంలోని గదిలో పురుగుమందు బాటిల్, బీర్ బాటిల్, ఒక గ్లాసు కూడా లభ్యమయ్యాయి. వారు మొదట పురుగుల మందు కలిపిన బీరు తాగి, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి వయస్సు 17 సంవత్సరాలు కాగా, బాలిక వయస్సు 16 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన బుదౌన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓపీ సింగ్ మాట్లాడుతూ... జంట ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామపెద్ద ఇచ్చారని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామన్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలంలోనే ఉందని, పోస్టుమార్టం తర్వాతే ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ALSO READ Good News : కేంద్రం రెండో గుడ్ న్యూస్..వాటి ధరలు కూడా తగ్గింపు..కోట్లాది మంది హ్యాపీ
మరోవైపు, ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలోనే ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఆ యువకుడిని కుటుంబ సభ్యులతో కలిసి హతమార్చింది ప్రియురాలు. ఆ తర్వాత బాధితుడి మృతదేహన్ని ఊరి చివర బావిలో పడేశారు బుదౌన్ జిల్లాకు చెందిన దినేష్, కుమారి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దినేష్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే కుమారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న దినేశ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న యువతి అతడిని చంపాలని నిర్ణయించుకుంది. తన మామయ్యతో కలిసి అతడిని హత్య చేసేందుకు పథకం రచించింది. ఈ క్రమంలోనే మాట్లాడాలంటూ దినేష్ ను మే10న తమ గ్రామానికి పిలిపించి హత్య చేసి ఊరి చివర బావిలో పడేశారు. బాధితుడు కనిపించకపోవడం వల్ల అతడి కుటుంబ సభ్యులు మే 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారి, ఆమె మామయ్య రాజారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు నేరం అంగీకరించారని ఎస్పీ సిద్ధార్థ్ వర్మ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.