ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేసి.. అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికేసి.. వీధికొకటి చొప్పున విసిరేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలంరేపింది. మృతుడు అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ఊరంతా ఈ హత్య గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో రామగుండం-గోదావరిఖని పట్టణాల్లో చోటుచేసుకున్న దారుణ సంఘటన కూడా ఇదే కావడంతో ఈ కేసును పోలీసులు సైతం సవాలుగా తీసుకున్నారు. దీనికి సంబంధించి గోదావరిఖని పోలీసులు (Police) చెప్పిన వివరాలివి..
ఎన్టీపీసీ(రామగుండం) ఖాజీపల్లికి చెందిన కాంపల్లి శంకర్(35) గోదావరిఖనిలోని విఠల్ నగర్ మీసేవా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఉదయం గోదావరిఖనికి వచ్చి మీసేవలో పనులు చూసుకుని సాయంత్రానికి ఇంటికెళ్లేవాడు శంకర్. అయితే, మొన్న గురువారం సాయంత్రం నుంచి అతను కనిపించకుండా పోయాడు. కంగారుపడిన కుటుంబీకులు.. శంకర్ గురించి తెలిసినవాళ్లందరినీ వాకబుచేసినా జాడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
శంకర్ కనిపించడంలేదంటూ తల్లి పోచమ్మ శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని కోసం గాలిస్తుండగానే.. శనివారం ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు గోడ వద్ద మొండెం లేని శంకర్ తల భాగాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో తల నుంచి వేరైన శంకర్ ఇతర శరీర భాగాలను వేర్వేరుచోట్ల గుర్తించారు. ఒక రోజంతా శరీర భాగాలను సేకరించడానికే పట్టింది.
మీ సేవ ఆపరేటర్ గా అందరికీ పరిచయస్తుడైన శంకర్ ను ఎందుకు చంపారనే కారణాలపై పోలీసులు ఆరా తీస్తుండగా, మృతుడి తల్లి పోచమ్మ సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకును అతని భార్య, ఆమె బంధువులే హత్య చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కక్ష ఉండబట్టే శంకర్ ను అంత దారుణంగా చంపి ముక్కలు చేశారని తల్లి పోచమ్మ ఆరోపిస్తోంది. శంకర్ హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని గోదావరిఖని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Murder case, PEDDAPALLI DISTRICT