బ్యాగ్ తీసుకొస్తానంటూ హాస్టల్లోకి వెళ్లిన కూతురు.. కొద్దిసేపటికే ఎవరో బిల్డింగ్ పై నుంచి దూకారని తెలిసి ఆ తండ్రి వెళ్లి చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

‘బుక్స్, బ్యాగు నేను తీసుకుని వస్తా. ఇక్కడే ఉండండి డాడీ‘ అని చెప్పి హాస్టల్ లోపలికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఓ యువతి నాలుగో అంతస్థు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని హస్టల్లో ఉన్న అతడికి తెలిసింది. తీరా చూస్తే..

 • Share this:
  యువత క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ఉపాధ్యాయులు కోప్పడ్డారనో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు కూడా దారుణాలకు కారణమవుతున్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదనో, సబ్జెక్టులు పోయాయన్న బెంగతోనో మరణిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫైనలియర్ పరీక్షలు ముగియడంతో తనను తీసుకెళ్లడానికి వచ్చిన తండ్రిని హాస్టల్ కిందే ఉండమని చెప్పి మరీ ఆమె దారుణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గోపాల్, రామలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గోపాల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన రెండో కుమార్తె రమ్య అనంతపురం నగరంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతోంది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ యువతి హాస్టల్ లోనే ఉండి చదువుకుంటోంది. ప్రతీ వారంతంలోనూ ఇంటికి వచ్చి వెళ్లేది. కొద్ది రోజుల క్రితం ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో కాలేజీ హాస్టల్లో తనకు సంబంధించిన దుస్తులు, పుస్తకాలను తీసుకుని వెళ్లేందుకు శుక్రవారం ఇంటి నుంచి తండ్రితో సహా వెళ్లింది.

  ‘బుక్స్, బ్యాగు నేను తీసుకుని వస్తా. ఇక్కడే ఉండండి డాడీ‘ అని చెప్పి హాస్టల్ లోపలికి వెళ్లింది. దీంతో తండ్రి హాస్టల్ కిందే ఉండిపోయాడు. అలా పైకి వెళ్లిన ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. కొద్ది సేపటి తర్వాత ఓ యువతి హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్థు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని హస్టల్లో ఉన్న అతడికి తెలిసింది. పాపం, ఎవరో ఏంటో అని చూసేందుకు ఆ తండ్రి కూడా వెళ్లాడు. తీరా చూస్తే తన కూతురే రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్ర గాయాల పాలయిన రమ్యను చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కుడికాలు విరగడంతోపాటు ముఖానికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైనలియర్ పరీక్షలు సరిగా రాయకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: