SBI: ఎస్‌బీఐ బ్యాంకులో దొంగలు పడ్డారు... పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు..

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

ఎస్‌బీఐ బ్యాంకులో పట్టపగలు దొంగలు పడ్డారు. అవును మీరు చదివింది అక్షరాలా నిజం. అయితే.. ఈ ఘటన జరిగింది రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాలో. బర్మార్ జిల్లాలోని సందరి తాలూకాలో ఉన్న కందప్ అనే గ్రామంలో ఎస్‌బీఐ బ్యాంకు ఉంది. ఆ బ్యాంకులో గత సోమవారం యధావిధిగా కార్యకలాపాలు నడుస్తున్నాయి.

  • Share this:
    ఎస్‌బీఐ బ్యాంకులో పట్టపగలు దొంగలు పడ్డారు. అవును మీరు చదివింది అక్షరాలా నిజం. అయితే.. ఈ ఘటన జరిగింది రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో. బర్మార్ జిల్లాలోని సందరి తాలూకాలో ఉన్న కందప్ అనే గ్రామంలో ఎస్‌బీఐ బ్యాంకు ఉంది. ఆ బ్యాంకులో గత సోమవారం యధావిధిగా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఉద్యోగులు వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఖాతాదారుల వారి పనుల నిమిత్తం బ్యాంకుకు వచ్చిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా.. బ్యాంకులోకి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు.

    తుపాకులు చూపించి చెప్పినట్లు వినకపోతే కాల్చేస్తామని బ్యాంకులో ఉన్న వారితో పాటు సిబ్బందిని కూడా బెదిరించారు. ముగ్గురి దగ్గరా పిస్టల్స్ ఉండటంతో ఎవరూ అడుగు ముందుకేసే ధైర్యం చేయలేదు. బ్యాంకు సిబ్బందిని బెదిరించి డబ్బు ఎక్కడ ఉందో అడిగి తెలుసుకున్నారు. 5 లక్షల 23 వేల రూపాయలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సాయంత్రం 3.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి తుపాకులు చూపించి బెదిరించి డబ్బు దోచుకెళ్లినట్లు సీసీ దృశ్యాల్లో స్పష్టమైంది.



    భోర్డా గ్రామం వైపు నిందితులు బైక్‌పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై సీరియస్‌గా దృష్టి సారించిన పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. పట్టపగలు బ్యాంకు ఖాతాదారులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకూ, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీలు ఉన్న సంగతి తెలిసి కూడా బ్యాంకులో దొంగతనం చేయాలని నిందితులు భావించడానికి కారణం ముసుగులేనని.. ముసుగులు వేసుకుంటే గుర్తుపట్టరని భావించి ఇంత ధైర్యంగా బ్యాంకులో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Shocking Twist: హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసుల రైడ్.. శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఈ జంట ఎవరో తెలిసి..

    సినిమాల్లో బ్యాంకు దొంగతనాలు చూసే ఇలా ముసుగులేసుకుని, తుపాకులతో బెదిరించి నిందితులు చోరీ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఎవరికి ఏ హాని తలపెడతారోనని బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఆ కొంతసేపూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కనిపించారు. బ్యాంకుల వద్ద సరైన సెక్యురిటీ లేకపోవడం, కొన్ని ఏటీఎంల వద్దనైతే అసలు సెక్యూరిటీ గార్డులే కనిపించరు. అలాంటి బ్యాంకులను, ఏటీఎంలనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసైనా బ్యాంకుల వద్ద నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును బ్యాంకులో దాచుకుంటే.. ఆ బ్యాంకుల్లో కూడా రక్షణ లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: