అది హర్యానాలోని గురుగ్రామ్. అక్కడి ఓ ఏటీఎం కియోస్క్ దగ్గరకు మనీ డ్రా చేసుకుందామని ఓ వ్యక్తి వచ్చాడు. కార్డ్ పెట్టాడు. ఏటీఎం ఏమీ చెప్పకుండా దిమ్మలా ఉంది. ఏంటిది పనిచేయట్లేదా అని మళ్లీ ట్రై చేశాడు. మళ్లీ అంతే... అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేకపోవడంతో... బ్యాంక్ పర్సనల్ హెల్పర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. కంప్లైంట్ రాసుకున్న బ్యాంక్ ఉద్యోగులు వెళ్లి చెక్ చేశారు. అసలా ఏటీఎంలో డబ్బే లేదు. కానీ చోరీకి రెండ్రోజుల కిందటే అందులో అదనంగా రూ.28 లక్షలు మనీ పెట్టినట్లు క్యాష్ నింపే సంస్థ తెలిపింది. మరైతే... డబ్బు ఏమైంది అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అర్థరాత్రి 2.30కి ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వచ్చారు. వాళ్ల ముఖాలకు మాస్కులు ఉన్నాయి. ముందుగా సీసీటీవీని టేపుతో మూసేశారు. ఆ తర్వాత చోరీ జరిగినట్లు అర్థమైంది.
ఓ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మే 23న ఈ చోరీ జరిగింది. మే 20న ఏటీఎంలో డబ్బును సెట్ చేశారు. పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేయగా ఓ విషయం తెలిసింది. ఏటీఎంలను చోరీ చేసేవాళ్లు జనరల్‌గా గ్యాస్ కట్టర్ తెచ్చి... కియోస్క్‌ని పగలగొడతారు. కానీ... ఈ చోరీ అలా జరగలేదు. ఏటీఎం ఏమాత్రం చెక్కు చెదరలేదు. లోపల రూ.42.39 లక్షలు మాయమయ్యాయి.
ప్రత్యేకమైన చిన్న హ్యాకింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఈ చోరీ చేశారని పోలీసులు భావిస్తున్నారు. అలాంటి యంత్రం ద్వారా... మరిన్ని చోరీలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. డబ్బు నింపే సంస్థలో ఉద్యోగులకూ, ఈ చోరీకీ సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి చోరీ ఎవరు చేశారో, ఎలా చేశారో మాత్రం తెలియట్లేదు.
ఏటీఎంల దగ్గర చాలా బ్యాంకులు సెక్యూరిటీని పెట్టుకోవట్లేదు. అదనపు ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇలా చేస్తున్నాయి. ఐతే... ఇలాంటి ఎవరూ లేని ఏటీఎంలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Crime story, Haryana