పుణె: ఒక ఆడ పిల్ల అప్పటిదాకా కని పెంచిన తల్లిదండ్రులను వీడలేక వీడలేక వీడుతూ అత్తగారింట్లో అడుగుపెడుతుంది. అలాంటి కోడలిని అత్తమామలు కూతురుతో సమానంగా చూసుకోవాలి. కానీ.. తండ్రిలా చూసుకోవాల్సిన మామే కోడలిపై కన్నేస్తే. ఆ వివాహిత తన బాధ ఎవరితో చెప్పుకుంటుంది. భర్త చూసీచూడనట్టు వ్యవహరిస్తే ఆ బంగారు తల్లి తట్టుకోలేకపోయింది.
భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలిసి ఆమె గుండె పగిలింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె జిల్లాలోని ఉరులి కాంచన్ ప్రాంతానికి చెందిన షీతల్ (28), విపుల్‌కు 2014లో వివాహమైంది. భారీగానే కట్నం ముట్టజెప్పి షీతల్ తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొన్నాళ్లు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఒక బాబు పుట్టాడు. కొన్ని నెలలకు విపుల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త ఒత్తిడి చేయడంతో పలుమార్లు పుట్టింటికి వెళ్లి అడిగినంత తీసుకొచ్చి ఇచ్చింది. అయినప్పటికీ విపుల్ కట్న దాహం తీరలేదు.
అత్తింట్లో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల్లా చూసుకోవాల్సిన అత్తమామలు వేధింపులకు గురిచేశారు. విపుల్ తండ్రి కోడలిపై కన్నేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పగా విపుల్ పట్టించుకోలేదు. దీంతో.. మామ నుంచి కోడలికి లైంగిక వేధింపులు మరింత పెరిగాయి. తట్టుకోలేక భర్తను ఇదేంటని గట్టిగా నిలదీసిన షీతల్‌కు భర్త గురించి పచ్చి నిజం తెలిసింది. మరో మహిళతో విపుల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని షీతల్‌కు తెలిసి ఆమె గుండె బద్ధలయింది.
ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. పైగా.. రెండు లక్షలు డబ్బు తీసుకురావాలని భార్యను విపుల్ వేధించసాగాడు. భర్త చూస్తే అలా, తండ్రిలా చూసుకోవాల్సిన మామ చూస్తే అలా వేధించడంతో ఆ బంగారు తల్లి తట్టుకోలేకపోయింది. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. మామ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
షీతల్ తండ్రి రోహిదాస్ తులసీరామ్ తన కూతురి చావుకు ఆమె మామ, భర్త, అత్త కారణమని.. ప్రధానంగా ఆమె భర్త తండ్రి వేధింపులు భరించలేకే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షీతల్‌కు ఆరేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. తల్లి చనిపోవడంతో చిన్న వయసులో ఆ పిల్లాడు అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షీతల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. షీతల్ అత్తమామలపై, ఆమె భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్తింటి వేధింపులకు 28 ఏళ్లకే షీతల్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Father in law, Pune news, Wife suicide