• Home
 • »
 • News
 • »
 • crime
 • »
 • MARRIED WOMAN BODY FOUND HANGING FROM BATHROOM SHOWER IN PANDARPALA SSR

Married Woman: భర్త ఇంట్లో లేడు.. తల్లికి కాల్ చేసి ఆ ఒక్కమాట చెప్పి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసింది.. చివరికి..

కుష్బూ ఫైల్ ఫొటో

మితిలేష్ చౌబే కుమార్తె కుష్బూ(23)కు, నారాయణ్ పండిట్‌కు గతేడాది ఫిబ్రవరి 4న వివాహమైంది. కుష్బూ బీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పెళ్లి సమయంలో భారీ మొత్తంలోనే కట్నకానుకలిచ్చి కుష్బూను అత్తారింటికి సాగనంపారు.

 • Share this:
  రాంచీ: జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల వివాహిత బాత్రూమ్‌లోని షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లోని భులి ప్రాంతంలో వెలుగుచూసింది. ఆమె భర్త వివాహితతో గొడవ పడి ఆరు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మితిలేష్ చౌబే కుమార్తె కుష్బూ(23)కు, నారాయణ్ పండిట్‌కు గతేడాది ఫిబ్రవరి 4న వివాహమైంది. కుష్బూ బీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పెళ్లి సమయంలో భారీ మొత్తంలోనే కట్నకానుకలిచ్చి కుష్బూను అత్తారింటికి సాగనంపారు. ఫైనలియర్ చదువుతున్న తన కుమార్తె డిగ్రీ పూర్తి చేయాలనుకుంటోందని చెప్పగా.. అందుకు నారాయణ్ పండిట్ కుటుంబం కూడా అంగీకరించింది. అయితే.. పెళ్లి సమయంలో ఉన్న పరిస్థితులు కొన్నాళ్లకు పూర్తిగా మారిపోయాయి. నారాయణ్ పండిట్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇల్లు గడవడానికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఏ పనీచేసేవాడు కాదు. దీంతో.. పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ అలా వచ్చిన డబ్బుతో సంసారాన్ని నెట్టుకొచ్చింది.

  సంపాదించడం సంగతి అటుంచితే తనకు ఐదు లక్షలు కావాలని.. తాను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని.. అందుకు డబ్బు సర్దాలని భార్యను నారాయణ్ పండిట్ ఇబ్బందిపెట్టేవాడు. మీ అమ్మానాన్నలను అడిగి ఐదు లక్షలు తీసుకురావాలని ఆమెను వేధించేవాడు. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన అతని తల్లి కూడా కోడలిని రాచిరంపాన పెట్టింది. దీంతో.. ఆ వేధింపుల గురించి పుట్టినింట్లో చెప్పుకోలేక.. మెట్టినింటి వేధింపులు తట్టుకోలేక కుష్బూ నరకయాతన అనుభవించింది. ఇక.. ఆ వేధింపులు తాళలేనని భావించిన ఆమె ఆత్మహత్యే శరణ్యమని భావించింది.

  తల్లికి శనివారం ఉదయం ఫోన్ చేసిన కుష్బూ ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయిందని.. పూట గడవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో.. కంగారు పడిన ఆమె తల్లి ఇరుగుపొరుగు వారితో కలిసి కూతురింటికి వెళ్లింది. ఇంటికి వెళ్లే సరికి తన కూతురు ఉండే రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా కుష్బూ నుంచి సమాధానం లేదు. ఆందోళన చెందిన ఇరుగుపొరుగు వారు తలుపులు బద్ధలు కొట్టి కుష్బూ కోసం వెతకగా బాత్రూమ్‌లో షవర్‌కు ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. కన్న కూతురిని అలాంటి స్థితిలో చూసిన కుష్బూ తల్లి గుండెలవిసేలా రోదించింది. కొద్దిసేపటికి అక్కడికి కుష్బూ తండ్రి, సోదరుడు కూడా చేరుకున్నారు. అత్తింటి వేధింపులు, భర్త రూ.5 లక్షలు తెమ్మని చిత్రహింసలు పెట్టడం వల్లే తమ బిడ్డ ఇలాంటి నిర్ణయం తీసుకుందని పోలీసులకు కుష్బూ కుటుంబం ఫిర్యాదు చేసింది.

  ఇది కూడా చదవండి: Mumbai: కన్నోళ్ల కాళ్లకు దణ్ణం పెడుతున్నాడని మంచోడనుకునేరు.. ఈ కొత్త పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలిస్తే..

  విడాకులిస్తామని కూడా తమ కూతురిని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదారు రోజుల క్రితం కుష్బూతో ఏదో విషయంలో గొడవపడి ఆమె భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. పోలీసులు కుష్బూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
  Published by:Sambasiva Reddy
  First published: