ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌... భార్య,స్నేహితుల సహకారంతో...

భర్త చేసే దోపిడీలకు, అత్యాచారాలకు అతడి భార్య సహకరించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: July 13, 2019, 11:25 AM IST
ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌... భార్య,స్నేహితుల సహకారంతో...
పోలీసుల అదుపులో నిందితుడు రమేశ్
  • Share this:
సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగం గ్రామానికి చెందిన రమేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బు చాలకపోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్న రమేశ్ నిర్ణయానికి అతడి భార్య దుర్గ, స్నేహితులు ఖాసీం, గోపీలు కూడా సహకరించడం మొదలుపెట్టారు. అయితే పురుషులకు బదులుగా ఒంటరిగా ఉండే మహిళలనే టార్గెట్ చేసుకున్న ఈ ముఠా... ఇప్పటివరకు అనేక మంది మహిళలను దోచుకోవడంతో పాటు వారిపై అత్యాచారాలకు కూడా పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రిపూట సత్తెనపల్లి నుంచి సమీప గ్రామాలకు వెళ్లేందుకు వేచి ఉన్న మహిళల్ని ఎంపిక చేసుకుని దోచుకోవడం ఈ ముఠా టార్గెట్.

వారి దగ్గర బంగారం వస్తువులు ఉంటే... ఎలాగోలా వారిని ఆటో ఎక్కించుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఆటోను రమేష్‌ నడుపుతూ అందులో ప్రయాణికుల మాదిరిగా దుర్గ, ఖాసీంలు ఎక్కి కూర్చుంటారు. గమ్యస్థానాలకు వెళ్లే మహిళలను నమ్మించి తమ ఆటో ఎక్కించుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక గోపీ కూడా ఆటు వైపు వెళుతున్నట్లుగా ఆటోలో ఎక్కుతాడు. తర్వాత గ్రామ శివారులో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి మూకుమ్మడిగా వారిని దోచేస్తారు. ఈ క్రమంలోనే అమరావతి నుంచి ఆటోలో గుంటూరుకు వస్తున్న నలుగురు నిందితులు ఈనెల 2వ తేదీ రాత్రి 14వ మైలు వద్ద వేచి ఉన్న ఓ మహిళను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు.

తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఆటోను నిలిపి ఆమె వద్ద ఉన్న నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.400 లాక్కొని, రమేష్‌ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ సమీపంలోని ఓ మిల్లు వద్దకు పరుగులు తీయడంతో వారు ఆటోలో పరారయ్యారు. ఈ మేరకు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్బన్, రూరల్‌ ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీఎస్‌ పోలీసులతో కలసి మొత్తం ఏడు ప్రత్యేక బృందాల్ని కేటాయించారు.

ఈ క్రమంలో ఈనెల 10న రమేష్, మరో ఇద్దరు యువకులు సత్తెనపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్నట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తకు దోపిడీలు, అత్యాచారాల్లో సహకరిస్తున్న దుర్గ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. విచారణలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు ? ఫిర్యాదులు చేసేందుకు ధైర్యం చేయలేని మహిళలను ఎంతమందిని అత్యాచారం చేశారు ? జిల్లాలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం.

(రఘు అన్నా, న్యూస్18 గుంటూరు ప్రతినిధి)

Published by: Kishore Akkaladevi
First published: July 13, 2019, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading