news18
Updated: November 13, 2020, 6:31 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 13, 2020, 6:31 AM IST
బైక్ బాగుంది.. ఎప్పుడు కొన్నారు. మైలేజ్ ఎంత వస్తుంది..? ఏమైనా రిపేర్ చేయించారా..? ఇంతవరకు ఎన్ని కిలోమీటర్లు తిప్పారు...? ఇంజిన్ లో ఏం ప్రాబ్లం లేదు కదా..? ఆర్సీ బుక్.. ఇన్సూరెన్స్.. మిగతా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా..? పేపర్లు లేకుంటే మళ్లీ నేను ఇబ్బందుల్లో పడతాను. టైర్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. సీటు కూడా కొంచెం చిరిగింది. అంతా బాగానే ఉంది. ఒకసారి నేను టెస్ట్ రైడ్ చేయొచ్చా..? ఆ మీకు అభ్యంతరం లేకుంటేనే..? ఇది నమ్మి బైక్ ఓనర్.. పైన అన్ని ప్రశ్నలు వేసినోడు మంచోడు కాబోలని బైక్ కీ ఇచ్చాడు. మీరిక్కడే ఉండండి.. ఐదు నిమిషాల్లో వస్తానని వెళ్లిన సదరు దొంగగారు.. మళ్లీ రాలేదు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన గౌరంగ కిర్తానియా అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితమే రిక్షా నడుపుకునే ఒక కార్మికుడి ఫోన్ నుంచి సిమ్ దొంగిలించాడు. ఆ సిమ్ తన ఫోన్ లో వేసుకున్నాడు. అంతకుముందే ఆన్లైన్ లో బైకులు విక్రయించడానికి రెడీగా ఉన్న పలువురి ఫోన్ నెంబర్లకు ఈ సిమ్ నుంచే ఫోన్ చేశాడు. ఇందులో ఒక వైద్యుడు తాను బైక్ అమ్ముతానని చెప్పాడు. దీంతో ఆ వైద్యుడికి ఫోన్ చేసి ఫలానా చోటుకు రావాలని.. వచ్చేప్పుడు బైక్ ను కూడా తీసుకురావాలని చెప్పాడు. వైద్యుడు.. కిర్తానియా చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు.
వైద్యుడికంటే ముందే అక్కడకు వచ్చిన కిర్తానియా అతడు రాగానే ముందు.. ఆ డాక్టర్ను మాటల్లో పెట్టాడు. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత... తాను ఒకసారి బైక్ టెస్ట్ రైడ్ చేస్తానని అడిగాడు. అంతకుముందే మాటలతో బురిడి కొట్టించడం వల్ల ఆ వైద్యుడు టెస్ట్ రైడ్ కు ఒప్పుకున్నాడు. బైక్ కీ ఇచ్చాడు. ఇదే సందనుకుని బైక్ వేసుకుని వెళ్లిన కిర్తానియా తిరిగి రాలేదు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఫోన్ నెంబర్ సాయంతో అతడిని పట్టుకున్నారు. అప్పుడతడు అసలు విషయం చెప్పాడు. సిమ్ తనది కాదని.. తన ఇంట్లో పనికి కుదిరిని రిక్షా డ్రైవర్ దని.. ఫోన్ కూడా వేరే దగ్గర దొంగతనం చేశానని పోలీసులకు తెలిపాడు. మరొకరి ఫోన్, సిమ్ తో ఫోన్ చేసి బైకు దొంగిలించి పారిపోతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో తాను ఈ పనికి పూనుకున్నానని వారికి వెల్లడించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని కటకటాలవెనక్కి నెట్టారు.
Published by:
Srinivas Munigala
First published:
November 13, 2020, 6:30 AM IST