హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video: మాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్‌లో గొడవ.. తుపాకీతో కాల్చిన సెక్యూరిటీ గార్డ్..

Viral Video: మాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్‌లో గొడవ.. తుపాకీతో కాల్చిన సెక్యూరిటీ గార్డ్..

సెక్యూరిటీ గార్డ్, గాయపడిన రాజేశ్

సెక్యూరిటీ గార్డ్, గాయపడిన రాజేశ్

మాస్క్ ఏదని అడిగినందుకు సెక్యూరిటీ గార్డును రాజేశ్ కుమార్ తిట్టాడు. దాంతో అతడు కూడా రెచ్చిపోయాడు. మాటా మాటా పెరిగి.. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ గార్డు సహనం కోల్పోయి తుపాకీతో కాల్చాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్తే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. లేదంటే జరిమానా వేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో చాలా మంది మళ్లీ మాస్క్‌ను పక్కనబెట్టేస్తున్నారు. ముఖానికి మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు. తమతో పాటు పక్క వారి ఆరోగ్యాన్ని కూడా రిస్క్‌లో పెడుతున్నారు. ఐతే ముఖానికి ధరించే ఈ మాస్క్ అప్పుడప్పుడూ పెద్ద గొడవలకే కారణమవుతోంది. జనాలు తిరిగే ప్రాంతంలో మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే.. మాస్క్‌ ఎందుకు లేదని పక్క వారు ప్రశ్నించడం.. నీకెందుకు అని వారు ఎదురు తిరగడం.. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఐతే చిన్న నిర్లక్ష్యమే యూపీలో ఓ పెద్ద గొడవకు దారితీసింది. ఏకంగా తుపాకితో కాల్చే వరకు వెళ్లింది. బ్యాంక్‌లో ఓ వ్యక్తి మాస్క్ ధరించనందుకు వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో సెక్యూరిటీ గార్డు తుపాకీ తీసి అతడిని కాల్చాడు. బరేలి జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

రాజేశ్‌ కుమార్‌ అనే రైల్వే ఉద్యోగి శుక్రవారం తన భార్యతో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు వెళ్లారు. బ్యాంకు లోపలికి వెళ్తున్న సమయంలో ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు. మాస్క్ లేకుంటే లోపలికి పంపించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ గార్డును రాజేశ్ కుమార్ తిట్టాడు. దాంతో అతడు కూడా రెచ్చిపోయాడు. మాటా మాటా పెరిగి.. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ గార్డు సహనం కోల్పోయి తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ నేరుగా రాజేశ్ తొడ భాగంలో దిగడంతో తీవ్ర రక్తస్రావమయింది. అతడు అలాగే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న భార్య బిగ్గరగా కేకలు వేసింది. నా భర్తను ఎందుకు కాల్చావు అంటూ అరించింది. అనంతరం రాజేశ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. తొడలో కాకుండా ఇతర శరీర భాగాల్లో బుల్లెట్ దిగి ఉంటే చనిపోయి ఉండేవాడని తెలిపారు.


కాగా, గాయపడిన రాజేశ్‌ను బ్యాంక్ నుంచి ఆస్పత్రికి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సెక్యూరిటీ గార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పడంతో, తనను బూతులు తిట్టాడని అతడు చెప్పాడు. నోటికొచ్చినట్లు మాట్లాడాడని తెలిపాడు. తుపాకీ తీసి బెదిరించాలని అనుకున్నానని.. కానీ అనుకోకుండా తుపాకీ మిస్ ఫైర్ అయిందని వివరణ ఇచ్చాడు. ఇది ఉద్దేశ్వపూర్వకంగా చేసిందని కాదని.. అనుకోకుండా జరిగిందని చెప్పాడు. మరోవైపు రాజేశ్ బంధువుల వాదన మరోలా ఉంది. మాస్క్ పెట్టుకోవాలని సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో రాజేష్ తన మాస్క్ తెచ్చుకొని ముఖానికి పెట్టుకున్నాడని, ఆ తర్వాత కూడా సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్లనీయలేదని చెప్పారు. లంచ్ టైమ్ అయినందున లోపలికి పంపించబోమని చెప్పాడని.. ఈ క్రమంలోనే గొడవ జరిగిందని తెలిపారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల ఫుటజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

First published:

Tags: Crime news, Face mask, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు