MAN RETURNS HOME ALIVE 24 HOURS AFTER FAMILY MEMBERS BURIED HIS BODY IN TAMIL NADU ERODE MKS
మూర్తి గారి మరణ మిస్టరీ: చనిపోయాడని పూడ్చిపెడితే.. 24 గంటల్లో ఇంటికి తిరిగొచ్చాడు!
మూర్తి
తండ్రి చనిపోయాడని వార్త తెలిసినప్పటికంటే అంత్యక్రియల తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరావడమే పెద్ద షాక్ లా అనిపించిందని కుటుంబీకులు చెప్పారు. అసలేం జరిగిందో కనిపెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు..
పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం వలవలా ఏడ్చింది.. పొరుగూరిలో పని కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో శ్రమకోర్చి శవాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.. విషాదంతో ఇల్లంతా కుంగిపోయిన కూర్చున్నవేళ..చనిపోయిన వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు.. 60 ఏళ్ల మూర్తిగారు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆయన కుటుంబీకులు, ఊరివాళ్లు నమ్మలేకపోయారు.. అసలేం జరిగిందో నిర్ధారించేందుకు పోలీసులూ రంగంలోకి దిగారు.. తమిళనాడులోని ఈరోడ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది..
తమిళనాడులోని ఈరోడ్‌కు సమీపంలోని బనగలద్‌పూర్ అనే ఊరుంది. సత్యమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఆ ఊర్లో మూర్తి అనే పెద్దమనిషి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వయసు 60 అయినా ఏరోజూ ఖాళీగా ఉండరాయన. ఎండాకాలం ఊళ్లో పెద్దగా పనులు లేకపోవడంతో చెరుకు తోటలో పని కోసం త్రిపూర్ వెళ్లాడు.
మొన్న ఆదివారం త్రిపూర్ నుంచి మూర్తి కుటుంబీకులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మూర్తి మరణవార్త. త్రిపూర్ బస్టాండులో విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ కాల్ తర్వాత త్రిసూర్ వచ్చిన మూర్తి కొడుకు కార్తీ.. చనిపోయింది తన తండ్రేనని నిర్ధారించుకున్నాడు. అప్పటికప్పుడు డబ్బులు సర్దుకొని మృతదేహాన్ని సొంతూరు బనగలద్‌పూర్ తీసుకొచ్చి అత్యక్రియలు నిర్వహించారు. అయితే,
ఆదివారం సాయంత్రం మూర్తి అంత్యక్రియలు జరగ్గా.. సోమవారం సాయంత్రానికి ఆయన సజీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. మూర్తిని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాకయ్యారు. తండ్రి చనిపోయాడని వార్త తెలిసినప్పటికంటే మళ్లీ ఇంటికి తిరిగిరావడమే పెద్ద షాక్ లా అనిపించిందని కుటుంబీకులు చెప్పారు. అసలేం జరిగింది? చనిపోయాడనుకొని కుటుంబీకులు పాతిపెట్టిన మృతదేహం ఎవరిది? మూర్తి ఆనవాళ్లు, వాళ్ల కొడుకుల ఫోన్ నంబర్లు చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండటమేంటి? అనే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.