నిజామాబాద్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ నేత దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని నవీపేటలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకుడు కొంచ రమణారెడ్డి హత్యకు గురయ్యారు. నిన్న ఉదయం గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో ఆయనను నరికి చంపారు.రమణారెడ్డి ఇంటి గేటులోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆవరణలో ఫోన్ మాట్లాడుతున్న రమణారెడ్డి మెడ, తలపై గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డిని ఆలయానికి వెళ్లి వచ్చిన ఆయన రెండో కూతురు చూసి, బోరున విలపించింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రెయినీ ఐపీఎస్ కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న రమణారెడ్డిని పోలీస్ వాహనంలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే మృతుడి హత్య వెనుక భార్య హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలోనే రమణా రెడ్డి హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య వివాహేతర సంబంధం, ఆస్తి పంపకాల గొడవలు హత్యకు కారణమవ్వచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.