MAN MISTAKENLY MURDERS STRANGER WOMEN FOR WIFE INCIDENT AT TIRUVANNAMALAI IN TAMILNADU MKS
Tamil Nadu : రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకొని మరొకరిని.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!
కౌసర్, దేవేంద్రన్
ఒకరికొకరు పరిచయం లేకున్నా భర్తల చేత వంచితులై నాటకీయ పరిణామాల మధ్య ఫుట్‌పాత్‌పైకి చేరారు ఇద్దరు మహిళలు. అందులో ఒకామె దారుణ హత్యకు గురైంది. అయితే చంపినవాడి టార్గెట్ చనిపోయిన మహిళకాదు. ఆద్యంతం షాకింగ్ మలుపులతో కూడిన కేసు వివరాలివే..
పేదైనా, రాజైనా ప్రతి ఒక్కరి జీవితంలో నాటకీయతకు ఏమాత్రం కొదువ ఉండదు. ప్రత్యేకించి క్రైమ్ ఘటనల్లోనైతే మనం ఊహించని మలుపులెన్నో కనిపిస్తాయి. ఇప్పటిదాకా జరిగినవి ఒక ఎత్తు, ఇది మరో ఎత్తు అనే తరహాలో అనూహ్య కేసులు వెలుగులోకి వస్తుంటాయి. ఒకరికొకరు పరిచయం లేకున్నా భర్తల చేత వంచితులై నాటకీయ పరిణామాల మధ్య ఫుట్‌పాత్‌పైకి చేరారు ఇద్దరు మహిళలు. అందులో ఒకామె దారుణ హత్యకు గురైంది. అయితే చంపినవాడి టార్గెట్ చనిపోయిన మహిళకాదు. అసలు వాళ్ల బతుకులు రోడ్డుపాలు కావడానికి, ఒకరిబదులు మరొకరు ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన పరిణామాలు షాకింగ్ గా అనిపిస్తాయి. తమిళనాడులోని తిరువణ్ణామలైలో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం వివరాలివే..
తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన దేవేంద్రన్(55) పశువుల వ్యాపారి. ఇతని మొదటి భార్య రేణుకాంబాల్ రెండు సంవత్సరాల క్రితం చనిపోవడంతో ధనలక్ష్మీ అనే మరోమహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ధనలక్ష్మికి గతంలోనే సురేష్ అనే వ్యక్తితో పెళ్లయినా, భర్త చనిపోవడంతో దేవేంద్రన్ తో రెండో పెళ్లికి ఒప్పుకుంది. 5 నెలల కిందట దేవేంద్రన్-ధనలక్ష్మిల పెళ్లి జరిగింది. అయితే కొద్ది రోజులకే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి..
దేవేంద్రన్ తో గొడవ జరిగిన ప్రతిసారి ధనలక్ష్మి భర్తను వదిలేసి ఆంబూరులోని బంధువుల ఇంటికి వెళ్లేది. అదే తరహాలో గత వారం కూడా ధనలక్ష్మి భర్తతో ఘర్షణ పడి ఆంబూరుకు వచ్చింది. ఆమె బంధువులు రోడ్డు పక్కన గుడారాల్లో జీవనం సాగించేవారు కావడంతో ధనలక్ష్మీ సైతంతోనే ఫుట్ పాత్ పై నిద్రించేది. ఇటీవల మరో కుటుంబం కూడా అదే ఫుట్ పాత్ పైకి చేరింది. ఆంబూరు కంబికొల్లై గ్రామానికి చెందిన జాన్ భాషా అనే వ్యక్తి చోరీ కేసులో అరెస్టయి జైలుపాలు కాగా, దిక్కుకోల్పోయిన అతని కుటుంబం అంబూరు ఫుట్ పాత్ పై ఆశ్రయం పొందుతున్నది. జాన్ పాషా భార్య కౌసర్(36) తన ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును వెంటపెట్టుకొని ఆంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని షూ కంపెనీ ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది.
వేర్వేరు పరిస్థితుల్లో ఒకే ఫుట్ పాత్ పైకి చేరిన కౌసర్ కుటుంబం, ధనలక్ష్మి బంధువులు వరుసగా పడుకొనేవారు. తనను వదిలేసి వెళ్లిందనే కక్ష పెంచుకున్న దేవేంద్రన్.. రెండో భార్య ధనలక్ష్మి రోజూ ఫుట్ పాత్ పైనే నిద్రిస్తోందని తెలుసుకొని ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు. శుక్రవారం రాత్రి ధనలక్ష్మి, జాన్ బాషా భార్య కౌసర్, ఈమె అత్త పర్వీన్ చిన్నారులు అంతా కలిసి ఫుట్ పాత్ పై నిద్రించారు.
నిద్రపోయిన మహిళలు అందరూ ముఖానికి బురకాలాగా ముసుగు ధరించి ఉండడంతో దేవేంద్రన్ తన భార్య అని భావించి కౌసర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. పక్కనే పడుకున్న ధనలక్ష్మి శబ్ధం విని దిగ్గునలేచి, ఆ దృశ్యాన్ని చూసి బిత్తరపోయి గట్టిగా కేకలు వేసింది. అప్పుడుగానీ తాను పొడిచింది మరో మహిళలని దేవేంద్రన్ కు అర్థమై, ధనలక్షిపైనా కత్తితో దాడి చేశాడు. ఈలోపే అరుపులకు నిద్రలేచిన చుట్టుపక్కల జనం పరుగున వచ్చి దేవేంద్రన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఆంబూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.