ఈ కాలంలో పెళ్లిళ్లు ఆగిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. అలాంటి తాను పెళ్లి చేసుకోబోయే యువతిపై అత్యాచారం జరిగిందని తెలిసి కూడా ఓ యువకుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమాజంలోని చాలామంది అతడిని అభినందించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ఈ రకంగా ఆలోచిస్తే... సమాజంలో హింసకు గురైన మహిళలకు తోడు దొరకడంతో పాటు వారికి న్యాయం కూడా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
విషయానికొస్తే... హర్యానాలోని ఛత్తర్ అనే గ్రామానికి చెందిన జితేందర్ ఖత్తర్ తన పక్క ఊరిలోని యువతిని ప్రేమించాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తరువాత తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె జితేందర్‌కు తెలిపింది. విషయం తెలుసుకుని ఏ మాత్రం టెన్షన్ పడిన జితేందర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యపై అత్యాచారం చేసిన వారిపై కేసు పెట్టాడు. భార్యకు న్యాయం జరిగేలా... నిందితులకు శిక్ష పడేలా చేయడంలో పోరాడుతున్నాడు.
అంతటితో అతడి పోరాటం ఆగలేదు. పోలీసులు, న్యాయవాదులను నమ్ముకుంటే తనకు న్యాయం జరగడం కష్టమని భావించిన జితేందర్... తాను స్వయంగా లా చదువుతున్నాడు. లా చదవడం పూర్తయిన తరువాత ఈ కేసును తానే స్వయంగా వాదించాలని నిర్ణయించుకున్నాడు. తన పోరాటం కేవలం తన భార్యకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే కాదని... రాష్ట్రంలో ఇలాంటి అమానుషాలకు బలవుతున్న అందరి తరపున పోరాడతానని జితేందర్ చెప్పడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.