news18
Updated: November 3, 2020, 6:23 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 3, 2020, 6:23 AM IST
సమాజంలో రాను రాను మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. చిన్నపాటి గొడవలకే సొంతవారిని సైతం చంపుకునేంత రీతిలో ప్రవర్తిస్తున్నారు మనుషులు. కూర్చుని పరిష్కరించుకోవాల్సిన గొడవలను.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చంపితే గానీ ఈ సమస్య తీరదు అనేంత క్రూరమైన మనస్తత్వం అలవరుచుకుంటున్నారు. చిన్నపాటి గొడవకే.. వందేండ్లు కలిసి నడవాల్సిన బంధాన్ని కాదనుకున్నాడో భర్త. భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య చేయడమే గాక ఆ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెరవాల్ గ్రామం సింధ్ క్యాంప్ కాలనీకి చెందిన హేమ్నాని, నైనా దంపతులకు గతేడాది పెళ్లి అయింది. హేమ్నాని స్థానికంగా ఉండే ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. నైనా ఇంటివద్దే ఉంటుంది. ఇప్పటిదాకా బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఆదివారం వారిద్దరి మధ్య చిన్న గొడవ మొదలయింది. అది చిలికి చిలికి గాలివానయింది. తన మాటకు అడ్డు చెబుతుందనే కారణంతో హేమ్నాని ఆమెను మందలించాడు. తన మాట కాదంటే చంపుతానని బెదిరించాడు. అయినా అతడి మాటలు ఆమె వినిపించుకోలేదు. దీంతో నిందితుడు అన్నంత పని చేశాడు.
ఆగ్రహంతో ఊగిపోతున్న హేమ్నాని.. నైనా గొంతు పిసికాడు. ఆమె కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నా విడవలేదు. ఆమె ఊపిరి ఆగిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాతే ఆమె కంఠం నుంచి హేమ్నాని చేతిని తీశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ఇక ఆ మృతదేహాన్ని అక్కడ ఉంచితే లేనిపోని సమస్యలు వస్తాయని గ్రహించాడు. అనుకున్నదే తడువుగా.. ఆ ఊరికి ఇరవై కిలోమీటర్ల ఆవల ఉన్న అడవిలో పాడేద్దామని అనుకున్నాడు.
ఆ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా.. స్కూటీ స్టీరింగ్, ఫుట్ రెస్ట్ కు మధ్య నైనా మృతదేహాన్ని ఉంచి.. రోహిషాల గ్రామం వైపునకు వెళ్లసాగాడు. ఆమె రెండు కాళ్లు నేల మీదనే పడుతున్నాయి. అయినా పట్టించుకోకుండా పది కిలోమీటర్ల దూరం దాకా లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు.. కంగుతిన్నారు. స్కూటీని ఆపాలని అరిచారు. ఆ స్కూటీ వెనకాల పరిగెత్తారు. కానీ హేమ్నాని అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దీంతో స్థానికులు తమ వాహనాల మీద వెళ్లి హేమ్నానిని ఆపారు. ఆయనను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. నైనాను తానే చంపానని, రోహిషాల గ్రామం ఆవల ఉన్న అడవిలో పడేయడానికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. కాగా పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఇరువురి కుటుంబాలను విచారిస్తే అసలు విషయాలు బయటకొస్తాయని పోలీసులు తెలిపారు.
Published by:
Srinivas Munigala
First published:
November 3, 2020, 6:20 AM IST