వివాహేతర సంబంధాలు కొన్నిసార్లు దారుణాలకు దారి తీస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ రకమైన వివాహేతర సంబంధం ఏకంగా మూడేళ్ల చిన్నారి హత్యకు కారణమైంది. మొదట ఈ ఘటనలో చనిపోయిన చిన్నారిని ఎవరు హత్య చేశారనే విషయం పోలీసులకు అంతుచిక్కలేదు. అయితే కేసు విచారణ సందర్భంగా పలు చిక్కుముళ్లను విప్పిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని పోలీస్ స్టేషన్ ఫేజ్-2 ఏరియాలో నివసిస్తున్న మూడేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు కొందరు దుండగులు. పోలీస్ ఫేజ్-2 ఏరియాలోని ఇలాహబాస్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇంట్లో గత డిసెంబర్ 28న మూడేళ్ల బాలిక శవమై కనిపించింది. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరీష్ చందర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గత డిసెంబర్ 25న బాలిక నాయనమ్మ పోలీస్ స్టేషన్ ఫేజ్-2లో ఫిర్యాదు చేసింది. బాలిక ఇంటి నుంచి తప్పిపోయిందని పోలీసులకు తెలిపింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 28న ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో బాలిక మృతదేహం లభించింది. చనిపోయింది తన మనవరాలు అని తెలిపిన బాలిక నాయనమ్మ.. ఆమెను ఎవరు చంపారో తనకు తెలియదని పేర్కొంది. అసలు తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని వెల్లడించింది. దీంతో ఎవరైనా ఆకతాయిలు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడ్డారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులకు బాలిక నాయనమ్మకు హేమంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలిసింది.
దీంతో హేమంత్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు అతడిని విచారించగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తనకు, బాలిక నాయనమ్మకు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు హేమంత్. బాలిక నాయనమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్న హేమంత్.. ఇందుకు మూడేళ్ల బాలిక అడ్డుగా ఉందని కోపం పెంచుకున్నాడు. బాలిక తండ్రి హత్య కేసులో జైలుకు వెళ్లాడని.. ఆమె తల్లి బాలికను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపాడు.
ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని భావించిన బాలిక నాయనమ్మ, ఆమె ప్రియుడు హేమంత్ కలిసి మూడేళ్ల బాలికను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. సంఘటన జరిగిన రోజు హేమంత్ బాలికతో ఇలాహబాస్ గ్రామం వైపు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిపై 376, 377 సెక్షన్లను పెంచినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి బాలిక నాయనమ్మ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.