news18-telugu
Updated: July 17, 2020, 9:14 AM IST
ప్రతీకాత్మక చిత్రం
పైసా.. పైసా.. నువ్వేం చేస్తావంటే.. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతా.. ప్రాణ స్నేహితుల్ని విడదీస్తానందట. అంటూ ఓ సినిమాలో చెప్పిన మాదిరిగానే ప్రస్తుత రోజులు మారాయి. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య తగాదాలు.. బంధువుల మధ్య గొడవలు.. హత్యలు పరిపాటిగా మారాయి. ఓ వ్యక్తి ఆస్తి కోసం సొంత అన్నను హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన కూచనిపల్లి రాజయ్య(58), కూచనిపల్లి పోచయ్య, కూచనిపల్లి శంకర్.. ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరిలో రాజయ్యకు భార్య మల్లవ్వ ఉండగా, పిల్లలు లేరు. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములకు కలిపి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది.
కొద్ది రోజులుగా శంకర్, రాజయ్యల మధ్య పొలం గట్టు విషయమై వివాదం నడుస్తోంది. బుధవారం శంకర్ మద్యం సీసా తీసుకుని రాజయ్య ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే రాజయ్య తన భార్య మల్లవ్వను రాగ్యట్లపల్లిలో ఉన్న అత్తగారింటి వద్ద దించి ఇంటికి వచ్చాడు. అనంతరం శంకర్, రాజయ్య ఇంటిలోనే మద్యం సేవించారు. మద్యం సేవిస్తుండగానే శంకర్ రాజయ్యను పదునైన కత్తి తీసుకుని హత్య చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో శంకర్.. భిక్కనూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన అన్న రాజయ్యను ఎవరో చంపారంటూ తెలిపాడు.
దీంతో పోలీసులు తిప్పాపూర్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే పోలీసులకు శంకర్‌పై అనుమానం వచ్చింది. విచారణలో రాజయ్యను ఆస్తి కోసం తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు శంకర్ ఇంటిపై దాడి చేసి కూల్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. నిందితుడు శంకర్.. ముందు జాగ్రత్తగా తన భార్య, కూతుర్లను బంధువుల ఇంటి వద్ద వదిలేసి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Narsimha Badhini
First published:
July 17, 2020, 9:14 AM IST