డబ్బు విషయంలో చోటుచేసుకున్న గొడవ.. ఓ కుటుంబం చిత్రహింసలకు గురయ్యేలా చేసింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. వీపనగండ్ల మండలం సంపత్‌రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య హైదరాబాద్‌లో స్థిరపడి జీహెచ్‌ఎంసీలో తాగునీటి ట్యాంకర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ట్యాంకర్ డ్రైవర్‌గా సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ను నియమించుకున్నాడు. అయితే కొంతకాలానికి శ్రీకాంత్ కూడా కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ట్రాక్టర్‌ను జీహెచ్‌ఎంసీకి కాంట్రాక్టు ప్రతిపాదికన తిప్పేవాడు. డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో శ్రీకాంత్ తనకు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉందని చంద్రయ్య అతడితో గొడవపడ్డారు.
డబ్బుల గురించి మాట్లాడుకుందామని చెప్పి.. చంద్రయ్య తన కారులో శ్రీకాంత్‌ను ఈ నెల 11న సంపత్‌రావుపల్లికి తీసుకొచ్చాడు. అనంతరం శ్రీకాంత్ పేరు చెప్పి.. అతడి భార్య అనిత, కూతురు శివాణి, కొడుకు వెంకటేశ్(నెలరోజుల పసికందు)ను అక్కడికి వచ్చేలా చేశాడు. అనంతరం కొంతమందితో కలిసి శ్రీకాంత్, అనితలపై కర్రలతో కొట్టించాడు. ఇలా వారం రోజుల పాటు వారిని నిర్భందించి.. చిత్రహింసలకు గురిచేశాడు.
ఇవి చదవండి: Online Classes: ఆన్‌లైన్ క్లాసులు.. ఈ పిల్లాడికి జరిగినట్టుగా మరెవరికి జరగకూడదు..
అయితే మంగళవారం రాత్రి బాధితుల అరుపులు విన్న గ్రామస్తులు.. డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు విముక్తి కల్పించారు. అయితే అప్పటికే చంద్రయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక, బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వీపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ వివిధ గ్రామాల ప్రజల నుంచి చంద్రయ్య, శ్రీకాంత్‌లు డబ్బు వసూలు చేశారని, ఆ గొడవే కిడ్నాప్‌కు కారణం కావచ్చనే అనుమానముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Telangana News, Wanaparthi