ఓ మహిళ తన బంధువుకు కాల్ చేసింది. కానీ అతడు మాత్రం స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. తీయడం లేదు. అతడికి ఏమైంది? ఎందుకని ఫోన్ ఎత్తడం లేదని సదరు మహిళకు అనుమానం వచ్చింది. జరగరానిది ఏదైనా జరిగి ఉండొచ్చని శంకించింది. భయం.. భయంగానే ఇంటికి వెళ్లింది. చివరకు ఆమె అనుమానమే నిజమైంది. తాను ఫోన్ చేసి ఆమె బంధువు శవమై తేలాడు. ఇంట్లోనే ఫ్రిజ్‌లో మృతదేహం లభ్యమైంది. ఆ శవాన్ని చూసి ఆమె గజాగజా వణికిపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దేశరాజధాని సీలంపూర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఓ మహిళ సీతంపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసింది. తన బంధువు శవం ఫ్రిజ్‌లో దొరికిందని చెప్పింది. తన బంధువు జాకీర్‌కు ఆమె చాలా సార్లు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ ఎత్తకపోవడంతో.. ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానించింది. కాసేపటి తర్వాత తానే స్వయంగా గౌతమపురిలోని అతడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో సామానులన్నీ చిందరవందరగా ఉన్నాయి. కానీ జాకీర్ కనిపించలేదు. ఎంత పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చి ఫ్రిజ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి చూసింది. అందులో మృతదేహం కనిపించడంతో ఆమె భయపడిపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్ని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. డెడ్‌బాడీని ఫ్రిజ్‌లో కుక్కి ఉండడం చూసి.. షాక్ అయ్యారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలను సేకరించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయి. ఇంట్లోనే అతడిని చంపేసి.. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. భార్యాపిల్లలు విడివిడిగా నివసిస్తున్నారు. భార్యతో గొడవలు జరగడంతో.. వేర్వేరుగా ఉంటున్నారు. 50 ఏళ్ల జకీర్‌ను ఎవరి చంపి ఉంటారన్నది అంతు చిక్కడం లేదు. గౌతమపురిలో మృతుడి ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతడి ఇరుగు పొరుగు వారిని కూడా ప్రశ్నించారు. జాకీర్ భార్యా పిల్లలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అని వివరాలు తెలుసుకుంటున్నారు. ఐతే ఘటనా స్థలంలో కొన్ని క్లూలు దొరికాయని.. కేసు దుర్యాప్తులో అవి కీలకం కానున్నాయని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. జకీర్‌ను అంత కిరాతకంగా చంపేయడంతో చాలా మంది భయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, New Delhi